సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు

10 Mar, 2017 14:10 IST|Sakshi
సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్.. సుప్రీం కోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు లేదని అన్నారు. సుప్రీం కోర్టు సుప్రీమేమీ కాదని వ్యాఖ్యానించారు. తాను దళితుడు కాబట్టే టార్గెట్ చేశారని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. శుక్రవారం కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు అరెస్ట్ వారెంట్ చేయడంపై జస్టిస్ కర్ణన్ స్పందించారు.

మీడియాతో జస్టిస్ కర్ణన్ మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయమూర్తులు పనివాళ్లు కాదని అన్నారు. 8 ఏళ్ల క్రితం తాను అవినీతి జడ్జిలపై ఫిర్యాదు చేశానని, హైకోర్టులో ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. ప్రస్తుత, మాజీ జడ్జిలు కొందరు అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి  ఆయన లేఖ రాశారు.