టీడీపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట | Sakshi
Sakshi News home page

టీడీపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట

Published Tue, Jan 31 2017 11:18 AM

టీడీపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట - Sakshi

కౌన్సిల్‌లో సబ్‌ ప్లాన్‌ నిధుల అంశం వాయిదా

కదిరి: తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల మధ్య ఉన్న విభేదాలు కౌన్సిల్‌ సాక్షిగా బయటపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల వినియోగం అంశంపై కొందరు కౌన్సిలర్లు మద్దతు పలికితే, అదే పార్టీకి చెందిన మరికొందరు విభేదించారు. ఈ విషయంపై చివరకు పోడియం దగ్గరకు వచ్చి వాదులాడుకున్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కలుగజేసుకుని వారిని వారి స్థానాల్లో కూర్చోబెట్టారు. చివరకు ఆ అంశాన్ని వాయిదా వేశారు.

చైర్‌పర్సన్‌ సురయాభాను అధ్యక్షతన సోమవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశం వాడీ వేడీగా సాగింది. సబ్‌ప్లాన్‌ నిధులన్నీ వైస్‌చైర్మన్‌ వసంత ప్రాతినిధ్యం వహించే వార్డుకే కేటాయించడమేంటని తొలుత టీడీపీ కౌన్సిలర్‌ చంద్ర కౌన్సిల్‌లో తన అభ్యంతరాన్ని తెలియజేసి, ప్లెక్సీని పట్టుకొచ్చి నిరసన తెలిపారు. ఇందుకు వైస్‌ చైర్మన్‌ మండిపడ్డారు. దళితవాడల అభివృద్ధికి అడ్డుతగిలితే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో కౌన్సిలర్‌ శంకర్‌ వైస్‌ చైర్మన్‌కు మద్దతు తెలిపి కౌన్సిలర్‌ చంద్రతో గొడవకు దిగారు. అఖరుకు ఆ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్‌పర్సన్‌ ప్రకటించారు. వచ్చే నెల 5న ఈ అంశంపై కౌన్లిలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుందామన్నారు. పింఛన్ల మంజూరులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించే వార్డులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ కౌన్సిలర్లు కిన్నెర కళ్యాణ్, ఖాదర్‌బాషా, జగన్, జిలాన్‌ మరికొందరు కౌన్సిల్‌ దృష్టికి తెచ్చారు. సమావేశంలో కమిషనర్‌ పీబీ ప్రసాద్, కౌన్సిలర్లు రాజశేఖరాచారి, షబ్బీర్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement