వృద్దుల కు వైద్య బీమా

4 Aug, 2013 00:50 IST|Sakshi
వృద్దుల కు వైద్య బీమా
వయసుతోపాటు ఆరోగ్య సమస్యలూ పెరుగుతుంటాయి. పెపైచ్చు వైద్య చికిత్స వ్యయం ఏటికేడాది పెరిగిపోతోంది కూడా. దీంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆ తరవాత ఆరోగ్య సమస్యలేమైనా వస్తే భరించటం దాదాపు అసాధ్యమవుతోంది. ఇలాంటి వారికి ఆరోగ్య బీమా తప్పనిసరి. గతంలో యువతకు, మధ్య వయసు వారికి మాత్రమే అందించే ఆరోగ్య బీమా ఇప్పుడు వృద్ధులకూ అందుబాటులోకి వచ్చింది. పలు కంపెనీలు సీనియర్ సిటి జన్స్ కోసం ప్రత్యేక పాలసీలు అందిస్తున్నాయి. ఏ కంపెనీ ఏ పాలసీ అందిస్తోందో... ఎంచుకునేటపుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసేదే.. ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ. 
 
 వైద్య బీమా పథకాలపై ఐఆర్‌డీఏ మార్గదర్శకాలను జారీ చేయడంతో ఇపుడు చాలా కంపెనీలు 60 నుంచి 80 ఏళ్ల వయసున్నవారికి వైద్య బీమా అందించడానికి ముందుకొస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు  ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో భార్య, భర్త, పిల్లలతో పాటు వారిపై ఆధారపడి ఉన్న తల్లిదండ్రులు, అత్తమామలకు కూడా వైద్యపరంగా బీమా రక్షణ అందజేస్తున్నాయి. కొన్ని మాత్రం సీనియర్ సిటిజన్స్‌కు వ్యక్తిగత పాలసీలను అందిస్తున్నాయి. సాధారణ ఫ్యా మిలీ ఫ్లోటర్ పాలసీలలోనైతే తల్లిదండ్రులకు బీమా రక్షణ ఉండదు. కానీ అపోలో మ్యూనిక్, స్టార్ హెల్త్, బజాజ్ అలయంజ్, ఓరియంటల్ , నేషనల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు ఈ సౌకర్యం కల్పిస్తున్నాయి. వ్యక్తిగతంగా అందించే పాలసీల్లో కొన్నిటికి గరిష్టంగా 80 ఏళ్ల వరకు అనుమతిస్తుండటం విశేషం. 
 
 వ్యాధులుంటే నిబంధనలు చూడాలి...
 ఇప్పుడు చిన్న వయసులోనే పలు వ్యాధులు వస్తున్నాయి. ఇక సీనియర్ సిటిజన్స్ అంటే బీ.పీ, షుగర్ వంటి వాటితో పొటు ఏవో కొన్ని సమస్యలుండటం సహజం. సాధారణంగా పాలసీ తీసుకునేటప్పటికే ఏదైనా వ్యాధి ఉంటే వారి విషయంలో కంపెనీలు కొన్ని నిబంధనలు విధిస్తాయి. సాధారణంగానైతే పాలసీ తీసుకున్న మొదటి లేదా రెండు సంవత్సరాల వరకు ఇలాంటి వ్యాధులకు బీమా రక్షణ కల్పించరు. ఆ తరవాత మిగిలిన వ్యాధుల్లా వీటికీ పూర్తిస్థాయి బీమా రక్షణ కల్పిస్తారు. కొన్నయితే ఇలాంటి వ్యాధులకు చికిత్స వ్యయం లో సగం వరకే చెల్లిస్తామంటున్నాయి. ఉదాహరణకు స్టార్ హెల్త్ అందిస్తున్న రెడ్ కార్పెట్ పథకాన్ని తీసుకుంటే ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధులకు రెండో ఏడాది తర్వాత క్లెయిమ్ సంభవిస్తే చికిత్సా వ్యయంలో 50 శాతమే చెల్లిస్తుంది. అందుకే సీనియర్ సిటిజన్స్‌కు పాలసీ తీసుకునే ముందు అప్పటికే ఉన్న వ్యాధుల విషయంలో కంపెనీ ఏ నిబంధనలు విధించిందో తప్పకుండా పరిశీలించాలి.
 
 కో-పేమెంట్‌ను చూసుకోవాలి...
 ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీలు సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చే పాలసీల్లో కో-పేమెంట్ ఆప్షన్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. కో-పేమెంట్ అంటే క్లెయిమ్ మొత్తం బీమా కంపెనీ చెల్లించకుండా కొంత మొత్తాన్ని పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. అలా ఎంత మొత్తాన్ని చెల్లించడానికి పాలసీదారు ముందుకొస్తే... ప్రీమియం ఆ మేరకు తగ్గుతుందన్న మాట. సాధారణంగా కంపెనీలు 10 నుంచి 20 శాతం కో-పేమెంట్‌గా నిర్ణయిస్తున్నాయి. దీన్లో ఏదైనా ఉంచుకోవచ్చు. ఉదాహరణకు మీరు తీసుకున్న పాలసీలో కో-పేమెంట్ 20 శాతంగా ఉందనుకుందాం. ఒకవేళ మీరు రూ.2 లక్షలు క్లెయిమ్ చేస్తే బీమా కంపెనీ రూ.1.60 లక్షలు మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన 40 వేలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. 
 
 ఆదాయపు పన్ను ఆదా...
 హెల్త్ పాలసీలకు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. సెక్షన్ 80సీ ప్రకారం లభించే లక్ష రూపాయల మినహాయింపులకు ఇది అదనం. భార్య, భర్త, పిల్లల పేరిట చేసే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80డీ కింద రూ.15,000 వరకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. అదే తల్లిదండ్రులకు కూడా మీరే ప్రీమియం చెల్లిస్తే మరో రూ.15,000 మినహాయింపు అదనంగా పొందవచ్చు. తలితండ్రులు సీనియర్ సిటిజన్లయి... 65 ఏళ్లు నిండితే రూ.20,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే హెల్త్ పాలసీలకు చెల్లించే ప్రీమియంపై గరిష్టంగా రూ.35,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చన్న మాట.
 
 తీసుకునేటప్పుడు జాగ్రత్తలు
   పాలసీ తీసుకునే ముందు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. ఏయే వ్యాధులకు కవరేజ్ ఉంది... వేటికి ఉండదనేది స్పష్టంగా తెలుసుకోవాలి.  పాలసీ తీసుకునే నాటికి ఏదైనా వ్యాధి ఉండి దానికి చికిత్స చేయించుకుంటే ఆ విషయాన్ని దాచొద్దు.  క్లెయిమ్ సమయంలో ఇది బయటపడితే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి అవన్నీ ముందే చెబితే ఆ మేరకు కొంచెం ప్రీమియం పెరిగినా... రెండు మూడేళ్ల తరవాత వాటికీ కవరేజీ లభిస్తుంది. 
 
   ఎంత మొత్తానికి బీమా కావాలనేది ముందే నిర్ణయించుకుని ఆ మేరకు పాలసీ తీసుకోవాలి. తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులందరికీ కవరేజ్ ఉంటే మంచిది.   60 ఏళ్లు దాటాక పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. కనక వీలైనంత చిన్న వయసు నుంచే పాలసీ తీసుకుని దాన్ని రెన్యువల్ చేయించుకుంటూ పోవాలి. దీనివల్ల 60 ఏళ్లు దాటినా అధిక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. నోక్లెయిమ్ బోనస్‌ల వలన ప్రీమియం తగ్గడం లేదా బీమా రక్షణ మొత్తం పెరగడం జరుగుతుంది.
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
 కంపెనీ పాలసీ ఎంట్రీ ఏజ్
 నేషనల్ ఇన్సూరెన్స్ వరిష్ట మెడిక్లెయిం 60-80
 ఓరియంటల్ హోప్ పరిమితి లేదు
 స్టార్ హెల్త్ రెడ్ కార్పెట్ 60-69
 బజాజ్ అలయంజ్ సిల్వర్ హెల్త్ 46-70
 రిలయన్స్ స్టాండర్డ్ ప్లాన్ 18-65
 అపోలో మూనిక్ ఆప్టిమా సీనియర్ గరిష్టం 65
 మ్యాక్స్ బూపా హార్ట్ బీట్ గరిష్టంగా 70
 
మరిన్ని వార్తలు