మెలానీయా టూర్‌లో మెలిక!

21 May, 2017 13:02 IST|Sakshi
మెలానీయా టూర్‌లో మెలిక!
  • నాడు మిషెల్లీని విమర్శించిన ట్రంప్‌!
  • నేడు ట్రంప్‌ సతీమణిదీ అదే దారి..
  • తలపై వస్త్రం లేకుండానే పర్యటన

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు తమ తొలి విదేశీ పర్యటనలో భాగంగా శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు.  అయితే, ట్రంప్‌ సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలైన మెలానీయా ట్రంప్‌ ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధంగా తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడం గమనార్హం. 2015 జనవరిలో అప్పటి ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడాన్ని ట్రంప్‌ తప్పుబట్టారు. ఇలా చేయడం సౌదీని అవమానించడమేనని, దీనివల్ల అమెరికాకు శత్రువులు మరింత పెరిగిపోతారని ట్విట్టర్‌లో విమర్శించారు.

    ఇప్పుడు అదే ట్రంప్‌ సతీమణితోపాటు ఆయన కూతురు, వైట్‌హౌస్‌ సలహాదారు ఇవాంకా ట్రంప్‌ సైతం తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడం గమనార్హం. ఇస్లామిక్‌ సంప్రదాయ రాజ్యమైన సౌదీలో మహిళల పట్ల, మహిళల వస్త్రధారణ పట్ల పలు ఆంక్షలు ఉంటాయి. సౌదీకి చెందిన మహిళలు బహిరంగ ప్రదేశాలకు వస్తే కచ్చితంగా వెంట్రుకలు కనిపించకుండా తలపై స్కార్ఫ్‌ కప్పుకోవాల్సి ఉంటుంది. విదేశీ పర్యాటకులకు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల మహిళలకు ఈ సంప్రదాయం నుంచి మినహాయింపు ఉంటుంది.
     

>
మరిన్ని వార్తలు