రైతుల కడుపెందుకు మండింది?

8 Jun, 2017 17:20 IST|Sakshi
రైతుల కడుపెందుకు మండింది?

న్యూఢిల్లీ: మొన్న తమిళనాడు, నిన్న మహారాష్ట్ర, నేడు మధ్యప్రదేశ్, రేపు రాజస్థాన్‌... రాష్ట్రాల రైతులు ఎందుకు రగిలిపోతున్నారు? ఆరుగాలం కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులను రోడ్లపై పారబోసి ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? వారి నిన్నటి ఆర్తనాదాలకు, వారి నేటి రణన్నినాదాలకు రాజకీయ రంగులు లేవు.

వ్యవసాయ రంగం పట్ల తరతరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (పార్టీలతో సంబంధం లేకుండా) ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరే కారణమని వ్యవసాయ రంగంలో తలపండిన నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు. సరైన వ్యవసాయ విధానం ఎలా ఉండాలో సూచిస్తూనే ఉన్నారు. వాటిని పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే నేడు రైతుకు కడుపులో కాలింది.

పాలు, కూరగాయలనే ఎందుకు పారబోస్తున్నారు?
మహారాష్ట్రలోగానీ, మధ్యప్రదేశ్‌లోగానీ గోధుమలు, బియ్యం మినహాయించి పాలు, కూరగాయలను రైతులు నిరసనగా నేలపాలు చేయడం గమనార్హం. గోధుమలు, బియ్యానికి అంతో ఇంతో మద్దతు ధర ఉండడం, అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వాలే జోక్యం చేసుకొని వాటిని కొనుగోలు చేయడమే కాకుండా వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే అవకాశం ఉండడం, కూరగాయలకు, పప్పు దినుసలకు సరైన కనీస మద్దతు ధర లేకపోవడం, ఉన్నా ప్రభుత్వమే వాటిని నేరుగా కొనుగోలు చేయకపోవడం కూడా కారణం.

కేంద్ర కనీస మద్దతు ధర జాబితాలో పేరుకు 25 రకాల వ్యవసాయోత్పత్తులు ఉన్నాయి. వాటిని ప్రభుత్వాలే నేరుగా కొనుగోలు చేయక పోవడం వల్ల రైతులు దలారుల దందాకు దగాపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో రైతులు టమోటాలను యాభై పైసలకు కిలో చొప్పున అమ్మలేక వాటిని రోడ్లపై పారబోసిన సందర్భాలను మనం అనేక సార్లు చూశాం.


ఆహార భద్రత ఏమయింది?
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని’ తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాన్ని ఇప్పటికీ అమలు చేయడం లేదు. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతోంది. నేడు మన రైతులు పప్పు, దినుసుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం వల్ల మన దేశం విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటోంది.

ఎందుకు రైతులకు నష్టాలు ?
భారత దేశంలో 58 శాతం మంది వ్యవసాయరంగంపై ఆధారపడి బతుకుతున్నప్పుడు వారికి ఎందుకు నష్టాలు, ఎందుకీ కష్టాలు? వ్యవసాయానికి ఖర్చు పెరగడం, ఉత్పత్తులకు ధరలు తగ్గడమని టూకీగా చెప్పవచ్చు. ఒక్క 2010 సంవత్సరం నుంచే పరిశీలిస్తే ఈ ఏడేళ్ల కాలంలో వ్యవసాయం ఖర్చు ఎంతో పెరిగింది. కేంద్రం మిశ్రమ ఎరువులకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకరావడంతో ముందుగా వాటి ధరలు పెరిగాయి. తర్వాత వాటి ప్రభావం యూరియాపై పడి దాని ధర కూడా పెరుగుతూ వచ్చింది. ఇక 2013 నుంచి ఎరువులతో పాటు విత్తనాలు, డీజిల్, కూలీల వేతనాలు పెరిగాయి.

4.6 శాతం వద్ధి రేటంట!
2016–17 సంవత్సరానికి వ్యవసాయ రంగంలో వద్ధిరేటు 4.9 శాతం సాధించామంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఘనంగా చెప్పుకుంది. వ్యవసాయోత్పత్తుల ఆధారంగా ప్రభుత్వాలు వద్ధి రేటను అంచనా వేస్తాయన్న విషయం ఎవరికైనా తెల్సిందే. ఆ ఉత్పత్తుల కోసం రైతులు ఎంత ఖర్చు పెట్టారు, వారికి ఎంత లాభం వచ్చిందన్న అంశాన్ని అసలు పరిగణలోకి తీసుకోరు. వారు నిజంగా లాభాలు గడించి ఉంటే దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోరు.


కనీస మద్దతు ధరల్లో వైఫల్యం
వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను కచ్చితంగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. కనీస మద్దతు ధరను మార్కెట్‌ వర్గాలు కొనుగోలు  చేయనప్పుడు ప్రభుత్వాలే రంగంలోకి దిగి కనీస మద్దతు ధరకు వాటిని కొనుగోలు చేయాలి. కానీ ప్రభుత్వాలు గోధమ, బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి వాటిని రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తోంది. ఈ కనీస మద్దతు ధర వల్ల దేశంలో కేవలం 6 శాతం మంది రైతులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం లెక్కలే చెబుతున్నాయి. మరి మిగతా 94 శాతం మంది రైతుల సంగతి ఏమిటీ?

వ్యవసాయోత్పత్తుల ఖర్చు 60 శాతం
వ్యవసాయోత్పత్తులకు ఎంత ఖర్చవుతుందో స్థూలంగా చెప్పాలంటే 60 శాతం ఖర్చే ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ రైతులకు ఆ లబ్ధి చేకూరడం లేదు. అదేమి చిత్రమోగానీ చమురు ఆధారిత ఎరువుల ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 2014, 2015 సంవత్సరాల్లో దేశంలో ఏర్పడిన కరవు పరిస్థితులు కూడా రైతులకు కష్టాలు తెచ్చాయి. క్యాష్‌ పంటలను పండిస్తున్న రైతులు కూడా నష్టపోతున్నారు. మార్కెట్‌ వర్గాలు సిండికేట్‌ అవడం, కొంత మంది ప్రభుత్వాధికారులు వారిచ్చే లంచాలకు అలవాటు పడడం అందుకు కారణం.


మరి రైతును ఆదుకునేదిలా?
దేశవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో పండించాలో తెలిపే ఓ సమగ్ర ప్రణాళికతో వ్యవసాయ క్యాలెండర్‌ రూపొందించాలి. అన్ని వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి. అందుకోసం అవసరమైతే ప్రభుత్వాలే నేరుగా జోక్యం చేసుకొని వాటిని కొనుగోలు చేసి రేషన్‌ షాపుల ద్వారా వినియోగదారులకు విక్రయించాలి. రైతుల అందుబాటులోకి చాలినన్ని మార్కెట్లు, శీతల గిడ్డంగులను తీసుకరావాలి.  2013 నాటి జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. రైతుల రుణాలను మాఫీ చేయడం మంచి విధానం కానప్పటికీ నేడు వ్యవసాయ రంగం కుదేలై ఉన్న సందర్భంలో అది కోలుకునే వరకు రుణాలను మాఫీ చేసి రైతుల ప్రాణాలను నిలబెట్టాలి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సకాలంలో స్పందించి రుణాలను మాఫీ చేయడంతో అక్కడి రైతులు రోడ్డున పడలేదు.

మరిన్ని వార్తలు