తగ్గిన దేశీయ కంపెనీల విదేశీ పెట్టుబడులు

7 Jan, 2014 01:32 IST|Sakshi

ముంబై: దేశీయ కంపెనీలు విదేశాలలో చేసే పెట్టుబడులు 2013 డిసెంబర్ నెలలో 37% క్షీణించాయి. 158 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం అంటే 2012 డిసెంబర్‌లో ఇవి 250 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాలివి. కాగా, 2013 నవంబర్‌లో సైతం ఈ పెట్టుబడులు 228 కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా మహారాష్ట్ర సీమ్‌లెస్, ఎంఅండ్‌ఎం, టాటా కమ్యూనికేషన్స్, భారతీ ఎయిర్‌టెల్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ తమ విదేశీ వెంచర్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి. సింగపూర్‌లోని తమ సొంత అనుబంధ సంస్థలో మహారాష్ర్ట సీమ్‌లెస్ 14.5 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయగా, మారిషస్‌లోగల పూర్తి అనుబంధ కంపెనీలో ఎంఅండ్‌ఎం 14 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెట్టింది.

ఇక టాటా కమ్యూనికేషన్స్ సింగపూర్ అనుబంధ కంపెనీలో దాదాపు 13.3 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయగా, షాపూర్‌జీ పల్లోంజీ అండ్ కంపెనీ యూఏఈలోగల భాగస్వామ్య సంస్థకు దాదాపు 12.9 కోట్ల డాలర్లను అందించింది. మారిషస్‌లోగల సొంత అనుబంధ సంస్థతోపాటు, నెదర్లాండ్స్‌లో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మొత్తంగా 9.17 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఇదే విధంగా పిరమల్ ఎంటర్‌ప్రెజెస్ యూఎస్ భాగస్వామ్య సంస్థలో 6.24 కోట్ల డాలర్లు, స్విట్జర్లాండ్‌లోని సొంత అనుబంధ సంస్థలో 5.92 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది.

మరిన్ని వార్తలు