మెక్సికో నుంచి గోడ దూకేవాళ్లు తగ్గారట

9 Mar, 2017 20:18 IST|Sakshi
మెక్సికో నుంచి గోడ దూకేవాళ్లు తగ్గారట

మెక్సికో నుంచి అక్రమ వలసలను నివారించడానికి ఎన్నికల ముందు డోనాల్డ్ ట్రంప్ పెద్ద హామీనే ఇచ్చారు. మెక్సికో-అమెరికా సరిహద్దు మొత్తం గోడ నిర్మిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే దానిపై ఇంతవరకు కార్యరూపం దాల్చనప్పటికీ గడిచిన నెల రోజుల ట్రంప్ పాలనలో మెక్సికో నుంచి అక్రమ వలసలు బాగా తగ్గాయట. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తొలి నెల రోజుల పాలనలో నమోదైన గణాంకాల మేరకు మెక్సికో అక్రమ వలసలు 40 శాతం మేరకు తగ్గాయని హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది.

సాధారణంగా ప్రతి నెలా 10 నుంచి 20 శాతం మేరకు మెక్సికో నుంచి అక్రమ వలసలు పెరుగాయని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ జాన్ కెల్లీ చెప్పారు. అయితే, అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ నివేదిక ప్రకారం జనవరి నుంచి ఫిబ్రవరి నెల రోజుల కాలంలో అక్రమ వలసలు 31,578 నుంచి 18,762 మందికి తగ్గింది. మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసదారుల విషయంలో గత ఐదేళ్లలో నమోదైన సంఖ్యతో పోల్చితే ఇదే అతి తక్కువ.

ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేస్తూ పటిష్టమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అక్రమ వలసల్లో వస్తున్న మార్పులకు సంకేతమని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు భద్రతను పెంచాలన్న ఆదేశాలకు అనుగుణంగా 5 వేల మంది సిబ్బందిని అదనంగా సరిహద్దు భద్రత వద్ద అక్రమ వలసదారులను నియంత్రించడానికి వినియోగిస్తున్నారు. సాధారణంగా మార్చి, మే నెలల్లో అక్రమ వలసలు ఎక్కువగా ఉంటాయని, వాటిని నియంత్రించడానికి మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కెల్లీ ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు