డిసెంబర్ 16 వరకు పార్లమెంట్

20 Oct, 2016 07:55 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 16న ముగియనున్నాయి. ఈ నెల 13న సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నవంబర్ 16 నుంచి.. డిసెంబర్ 16 వరకూ నిర్వహించాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
 
 ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభ సెక్రెటరీ జనరల్ షంషేర్ కె షరీఫ్ కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా, ప్రస్తుత సమావేశాలు 16వ లోక్‌సభలో 10వ సెషన్ కాగా.. రాజ్యసభకు 241వ సెషన్ కావడం గమనార్హం. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభమవుతాయి.
 
  అయితే ఈసారి వీటిని కాస్త ముందుకు జరిపి నవంబర్ 16నే సమావేశాలను ప్రారంభిస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుగానే నిర్వహించనున్న నేపథ్యంలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)కి సంబంధించి మిగిలి ఉన్న సెంట్రల్ జీఎస్‌టీ(సీజీఎస్‌టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ(ఐజీఎస్‌టీ) చట్టాలను నవంబర్ చివరినాటికి లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వానికి మార్గం సుగమమవుతుంది. జీఎస్‌టీ బిల్లులతో పాటు డజను బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ఆర్మీ సర్జికల్ దాడుల అంశం కీలకంగా మారే అవకాశాలున్నాయి.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా