ఒక్కో కేంద్రం రూ.10 కోట్లతో నిర్మాణం

20 Nov, 2020 20:11 IST|Sakshi

కనీసం ఆరునెలలకు సరిపడా మందుల నిల్వకు అవకాశం

నిర్మాణాలకు నిధులివ్వనున్న జాతీయ ఆరోగ్యమిషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రాంతీయ ఔషధ నిల్వ (రీజనల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ - ఆర్‌డీఎస్‌) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో వీటి నిర్మాణానికి జాతీయ ఆరోగ్యమిషన్‌ రూ.10 కోట్ల వంతున నిధులు ఇస్తోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ విస్తీర్ణంలో.. 40 వేల చదరపు అడుగుల్లో మందులు నిల్వ చేయడానికి అవకాశం ఉండేలా వీటిని డిజైన్‌ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన స్థలాల్లో ఏడాదిలోగా ఈ నిర్మాణాలను పూర్తిచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు ముమ్మరం చేసింది.

భారీగా నిల్వలకు అవకాశం
⇔ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 13 సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎస్‌) ఉన్నాయి.
⇔ దీనివల్ల మందుల నిల్వకు సరిపడా విస్తీర్ణం అందుబాటులో లేదు.
⇔ ఈ నేపథ్యంలో రాష్ట్రం పంపిన ప్రతిపాదనలతో మూడు ఆర్‌డీఎస్‌ల నిర్మాణానికి రూ.10 కోట్ల వంతున నిధులిచ్చేందుకు జాతీయ ఆరోగ్యమిషన్‌ అంగీకరించింది.
⇔ కొత్తగా నిర్మించే ఈ కేంద్రాల్లో క్వారంటైన్‌ సదుపాయంతో పాటు భారీగా మందులు నిల్వ చేసుకునే వీలుంటుంది.
⇔ మందుల్ని ఈ కేంద్రాల్లో నిల్వ చేసి అవసరాన్ని బట్టి జిల్లాలకు పంపిస్తారు.
⇔ ఒక్కో కేంద్రంలో కనీసం ఆరునెలలకు సరిపడా మందుల్ని నిల్వచేయవచ్చు.
⇔ మందుల నిల్వతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కోల్డ్‌చైన్‌ (శీతలీకరణ) అవకాశం ఉంటుంది.
⇔ ఇంజక‌్షన్లు, వ్యాక్సిన్‌లు, ఖరీదైన మందుల నిల్వకు ఇబ్బందులుండవు.

మరిన్ని వార్తలు