Sakshi News home page

Israel-Hamas conflict: ఇజ్రాయెల్‌ ప్రతీకారేచ్ఛ

Published Fri, Oct 20 2023 5:06 AM

Israel-Hamas conflict: Israeli army fired with missiles - Sakshi

ఖాన్‌ యూనిస్‌/న్యూఢిల్లీ: హమాస్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్‌ సైన్యం కొనసాగిస్తున్న భీకర దాడుల్లో సాధారణ పాలస్తీనియన్లు బలవుతున్నారు. గాజా స్ట్రిప్‌పై దాడులు తక్షణమే ఆపాలని, శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రపంచ దేశాలన్నీ విజ్ఞప్తి చేస్తున్నా ఇజ్రాయెల్‌ లెక్కచేయడం లేదు. శత్రువులు ఎక్కడ దాగున్నా మట్టుబెట్టడమే తమ లక్ష్యం అంటూ ఇజ్రాయెల్‌ సైన్యం గురువారం తెల్లవారుజామునే గాజాపై నిప్పుల వర్షం కురిపించింది. ఉత్తర గాజాతోపాటు దక్షిణ గాజాలో ‘సురక్షితమైన ప్రాంతాలు’ అని భావిస్తున్న చోట కూడా దాడులు చేసింది.

హమాస్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు. ఖాన్‌ యూనిస్‌లో దాదాపు 90 మంది ఆశ్రయం పొందుతున్న ఓ భవనం ఇజ్రాయెల్‌ క్షిపణి దాడిలో ధ్వంసమైంది. ఈ భవనంలో కనీసం 15 మంది మృతిచెందారని, మరో 40 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. గాజాలో శిథిలాల నుంచి చిన్న పిల్లల మృతదేహాలను బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు చూపరులను కలచి వేస్తున్నాయి.  

ఇప్పటిదాకా ఎంతమంది బలయ్యారో?  
ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. దాదాపు 23 లక్షల మంది పాలస్తీనియన్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హమాస్‌ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. ఇరుపక్షాల నడుమ ఈ నెల 7న ప్రారంభమైన యుద్ధం గురువారం 13వ రోజుకు చేరింది. ఇప్పటికే గాజాలో 3,785 మంది మరణించారు. దాదాపు 12,500 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ అధికారిక గణాంకాలే. వాస్తవంగా ఎంతమంది బలయ్యారో ఇప్పుడే తెలిసే అవకాశం లేదు. చాలా సమయం పట్టొచ్చు.  

ఒక్కపూట భోజనం.. మురికి నీరు   
గాజాలో ఆహారం, నీటి కొరత మరింత పెరిగింది. ఒక్కపూట భోజనం దొరకడమే గగనంగా మారింది. దాహమేస్తే మురికి నీరే దిక్కవుతోంది. ఈజిప్టు నుంచి గాజాకు మానవతా సాయం చేరవేయడానికి ఇజ్రాయెల్‌ అంగీకరించినప్పటికీ అది ఎప్పటికి అందుతుందో చెప్పలేమని స్థానిక అధికారులు అంటున్నారు. ఈజిప్టు సరిహద్దుల్లోని రఫాలో తమ వైమానిక దాడుల్లో హమాస్‌ అగ్రశ్రేణి మిలిటెంట్‌ హతమయ్యాడని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. గాజాలో వందలాది టార్గెట్లపై దాడులు చేశామని, మిలిటెంట్ల సొరంగాలు, నిఘా కేంద్రాలు, కమాండ్‌ సెంటర్లు, మోర్టార్‌–లాంచింగ్‌ పోస్టులను ధ్వంసం చేశామని వెల్లడించింది. మిలిటెంట్లు గాజాలో ఎక్కడ నక్కినా సరే దాడులు తప్పవని హెచ్చరించింది. వారు సాధారణ పౌరుల ముసుగులో తప్పించుకొనేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం ఉందని తెలియజేసింది.  

హమాస్‌ చేతికి ఉ.కొరియా ఆయుధాలు!
ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు ఉత్తర కొరియా ఆయుధాలు ప్రయోగించారా? అవుననే అంటోంది ఇజ్రాయెల్‌ సైన్యం. హమాస్‌ వీడియో దృశ్యాలు, మిలిటెంట్ల నుంచి        స్వా«దీనం చేసుకున్న కొన్ని ఆయుధాలను పరిశీలిస్తే ఇవి ఉత్తర కొరియా నుంచి వచి్చనట్లు తెలుస్తోందని నిపుణులు చెప్పారు. మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడికి ఎఫ్‌–7 రాకెట్‌ గ్రనేడ్‌తో, షోల్డర్‌ ఫైర్డ్‌ వెపన్స్‌ వాడినట్టు పేర్కొన్నారు. ఇవి ఉత్తర కొరియాకు చెందినవేనని అనుమానిస్తున్నారు. కానీ, హమాస్‌ మిలిటెంట్లకు ఎలాంటి ఆయుధాలు విక్రయించలేదని ఉత్తర కొరియా తేలి్చచెప్పింది.    

భూతల దాడులకు సిద్ధంగా ఉండాలి   
గాజాపై భూతల దాడులకు సిద్ధంగా ఉండాలని తమ సేనలకు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి యోవ్‌ గల్లాంట్‌ సూచించారు. గాజాలో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకోవాలని చెప్పారు. కానీ, భూతల దాడులు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయో బహిర్గతం చేయలేదు. ఆయన గురువారం గాజా సరిహద్దులో తమ సైనికులతో సమావేశమయ్యారు. ఆదేశాలు రాగానే ముందుకు కదిలేలా సర్వసన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గాజాను ఇప్పటిదాకా మనం బయటి నుంచే చూశామని, ఇకపై లోపలికి వెళ్లి చూడబోతున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.  

Advertisement

What’s your opinion

Advertisement