మెచ్చేలా.. ముచ్చటగా.. అటు ఇంటికి అలంకరణ, ఇటు ఉపాధి

18 May, 2023 04:52 IST|Sakshi

ఆకట్టుకునే ధాన్యం కుచ్చులు

వీటి అలంకరణతో ఇళ్లకు, ఆలయాలకు సరికొత్త శోభ

కుచ్చుల తోరణాలతో గడపలకు మరింత అందం

రబీ కోతల వేళ.. ఊపందుకున్న తయారీ

సాక్షి, అమలాపురం: పంటభూమిలో ఆరుగాలం చెమట చిందించి, పండించే ధాన్యాన్ని రైతు ఎంతో అపురూపంగా భావిస్తాడు. రెక్కల కష్టంతో దక్కిన ఫలితంలో కొంత భాగాన్ని దేవునికి పరమ భక్తితో నివేదిస్తాడు. తన కుటుంబ జీవనానికి ఊతంగా నిలిచి.. సిరులు కురిపించే వరి కంకులతో ఇళ్లను ముచ్చటగా.. చూసిన వారు మెచ్చేలా.. ముస్తాబు చేసుకుని మురిసిపోతాడు. వరి కంకులను అందంగా అల్లి తయారు చేసే ధాన్యం కుచ్చులను వీధిలో వేలాడదీసే వారు కొందరైతే... తోరణాలుగా చేసి సింహద్వారానికి అలంకరించే వారు మరికొందరు.

దేవాలయాల్లో సైతం ఇలా కుచ్చులు కట్టడం, ఆలయ సింహద్వారాలకు తోరణాలు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఏటా సంక్రాంతి సమయంలో పచ్చని కోనసీమలో జరిగే తీర్థాలకు భక్తుల భుజస్కంధాలపై వెళ్లే ప్రభలకు సైతం ధాన్యం కుచ్చులు తగిలించి, తాము పండిచిన ధాన్యాన్ని దైవానికి నైవేద్యంగా సమర్పిస్తూంటారు. ప్రకృతి ప్రేమికులు సైతం ధాన్యం కుచ్చులను వీధుల్లో ఉంచి, పక్షులకు ఆహారంగా అందిస్తూంటారు.

పక్షులకు ఆహారంగా..
పక్షులకు ఆహారంగా అందించేందుకు సైతం పలువురు ధాన్యం కుచ్చులను ఇళ్లు, ఆలయాలు, పంట పొలాల వద్ద ఉండే రైతుల ఇళ్ల (మకాం) వద్ద విరివిరిగా ఏర్పాటు చేస్తున్నారు. కొందరు ప్రకృతి ప్రేమికులు పక్షుల సందడి అధికంగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఉంచుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన పెనుమాక మహాలక్ష్మి ఇటీవల మృతి చెందారు.

ఆయన ఆరు దశాబ్దాల పాటు పక్షులకు ఆహారంగా ధాన్యం కుచ్చులను అందుబాటులో ఉంచారు. ఊళ్లోని ఆలయాలకు, చెట్లకు, నాలుగు రోడ్ల కూడళ్లలోని స్తంభాలకు, ఎత్తయిన భవనాలకు కుచ్చులు కట్టి, పక్షులకు ఆహారంగా అందించేవారు. ‘ఊపిరి ఉన్నంత వరకూ కుచ్చులు కట్టి, పక్షులకు ఆహారం అందిస్తాను’ అని ఆయన తరచూ అనే­వారు. ఆ మాటను అక్షరాల నిజం చేశారు.

చేయి తిరిగిన వారే చేయగలరు
రబీ వరి కోతలు జోరుగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వరి కుచ్చులు తయారు చేస్తూ పలువురు బిజీ అయిపోయారు. వీటిని తయారు చేయడం అంత సులువేమీ కాదు. గతంలో వీటిని తయారు చేయడానికి ప్రత్యేకంగా కొందరు ఉండేవారు. ఆ తరం దాదాపు తగ్గిపోవడంతో కొన్నాళ్లు కంకుల కుచ్చులు కూడా కనుమరుగయ్యాయి.

కానీ ఇప్పుడు తిరిగి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దీంతో పలువురు పెద్ద తరం వారి వద్ద నేర్చుకుని వరి కుచ్చులు, తోరణాల తయారీ విరివిగా చేపడుతూ ఉపాధిగా పొందుతున్నారు. కోత కోసిన తరువాత ధాన్యం పరకలను ప్లాస్టిక్‌ తాడు లేదా పురికొసకు ఒకదాని తరువాత ఒకటిగా వేలాడదీస్తూ కడతారు. తరువాత అన్నిటినీ కలిపి గుండ్రంగా చుట్టడం ద్వారా ధాన్యం కుచ్చు తయారు చేస్తారు. ఇది పూర్తయిన తరువాత గడ్డి చూరులు లేదా పురికొసను తాడుగా తయారు చేసి ధాన్యం కుచ్చులను ముస్తాబు చేస్తారు.

ప్రస్తుతం వరి కుచ్చులను ఇంటి ముందు పెట్టాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరికీ విపరీతంగా పెరిగింది. పల్లెల కంటే పట్టణ వాసులే ధాన్య కుచ్చులపై ఆసక్తి చూపుతూండటం విశేషం. పలు ప్రాంతాల్లో ధాన్యం కుచ్చులు, తోరణాలు తయారు చేసి రోజుకు రూ.500 నుంచి రూ.1,000 వరకూ ఆదాయం పొందుతున్నారు. కొంతమంది వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు తీసుకు వెళ్తున్నారు.

కుచ్చులతో ఉపాధి
అంబాజీపేట మండలం జి.అగ్రహారానికి చెందిన ఆకుమర్తి వేమ సుందరరావు ధాన్యం కుచ్చులు, పండ్లకు బుట్టలు కట్టి ఉపాధి పొందుతున్నారు. అంతకు ముందు దినసరి కూలీగా ఉండే సుందరరావు ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నారు. తరువాత ఇంటి వద్దనే ఉంటూ ఈ పని చేస్తున్నారు. ‘వరి పనలు తెచ్చి చాలా మంది నా వద్ద కుచ్చులు తయారు చేయించుకుంటారు. సైజును బట్టి రూ.150 నుంచి రూ.500 వరకూ ఇస్తుంటారు’ అని సుందరరావు చెప్పారు. 

మరిన్ని వార్తలు