కొలకలూరులో ‘మధ్యయుగ చరిత్ర’

10 Apr, 2021 12:19 IST|Sakshi
దేవాలయ ఆవరణలో అపురూప శిల్పాలు- 14వ శతాబ్దపు ద్వార శాఖలు

వెయ్యేళ్లనాటి శిల్పాలను గుర్తించిన పరిశోధకులు

శాసనాల్లో కొలకలూరు పేరు కొలంకలూరుగా ప్రస్తావన

తెనాలి: మధ్యయుగ చరిత్ర, సంస్కృతికి ప్రతీకలైన వెయ్యేళ్ల నాటి అపురూప శిల్పాలను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. తెనాలి రూరల్‌ మండల గ్రామం కొలకలూరు గ్రామంలోని పురాతన అగస్త్యేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో అస్తవ్యస్తంగా ఈ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్‌రెడ్డి సమాచారంతో ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి శుక్రవారం దేవాలయాన్ని సందర్శించారు. అక్కడి శిల్పాలు వెయ్యేళ్ల నాటివిగా ప్రకటించారు.

దేవాలయం ఆవరణలో గుర్తించిన శిల్పాల్లో మహిషాసుర మర్దిని (క్రీ.శ 10వ శతాబ్దం), వెయ్యేళ్లనాటి శివలింగాలు, ఒకే శరీరంతో మూడు నాట్యభంగిమలను ప్రదర్శిస్తున్న నృత్యకారుడు (క్రీ.శ 13వ శతాబ్దం), దేవి విగ్రహం (క్రీ.శ 16వ శతాబ్దం)తోపాటు శివద్వార పాలకులు చెక్కిన ద్వారశాఖలు (క్రీ.శ 14వ శతాబ్ది తలుపు చెక్కలు) ఉన్నాయి. 
వేంగి చాళుక్య, కాకతీయ, విజయనగర శిల్పకళలకు అద్దంపడుతున్న శిల్పాలను అదే ఆలయ ప్రాంగణంలో ఎత్తైన పీఠాలపై నిలిపి, వాటి వివరాలతో కూడిన పేరు పలకలను బిగించి, భద్రపరచాలని దేవదాయ, పురావస్తుశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. 
వీటితోపాటు అక్కడ క్రీ.శ 1241, 1242, 1318కి చెందిన నాలుగు శాసనాలను గుర్తించారు. వాటిలో అగస్తేశ్యరస్వామి ఆలయ సేవలకు నియమితులైన మహిళల కోసం అమిరినాయుడు రెండు పుట్ల భూమిని దానం చేశారు. 
కులోత్తుంగ చోళుడి సామంతుడైన కొండపడుమాటి బేతరాజు సేవకుడైన రెంటూరి ఎక్కిటి, అదే దేవాలయ అఖండ దీపానికి 50 ఆవులను దానం చేసినట్టు ఉంది. 
క్రీ.శ 1318 శాసనాల్లో కాకతీయ ప్రతాపరుద్రుని సకల సేనాధిపతి సోమయ లెంక కుమారుడు పోచులెంక అగస్తేశ్వరుడి సోమవార నిబంధనకు, వీరభ్రదునికి 8 పుట్ల భూమిని, పోచు లెంక కేశవ పెరుమాళ్లుకు శనివార నిబంధనకు 5 తూముల భూమిని దానం చేసినట్టు లిఖించారు. 
శాసనాల్నింటిలోనూ కొలకలూరు గ్రామం పేరును కొలంకలూరుగా లిఖించడం విశేషం.
చదవండి:
పత్రికల్లో వార్తలు సేకరించి.. ఇంటెలిజెన్స్‌ డీఎస్పీనంటూ..   
ఆర్‌ఆర్‌ఐలో అక్రమాలు: వారికి ధనార్జనే ధ్యేయం

మరిన్ని వార్తలు