Srisailam temple: దుకాణాల వేలంలో అందరూ పాల్గొనవచ్చు: సుప్రీం కోర్టు

18 Dec, 2021 11:32 IST|Sakshi

టీడీపీ హయాంలోని జీవోపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలంలోగల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ దుకాణాలు, దుకాణ సముదాయాల వేలంలో హిందుయేతరులూ పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వేలంలో హిందూయేతరులు పాల్గొనరాదంటూ 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ జీవోను పలువురు హైకోర్టులో సవాల్‌ చేశారు. ఆ జీవోను సమర్థిస్తూ 2019లో ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు గతేడాది జనవరిలో స్టే ఇచ్చింది. సుప్రీం ఆదేశాలు అమలు చేయలేదంటూ జానీబాషా, టీఎం రబ్బానీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ , జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.

చదవండి: 2018 డీఎస్సీలో భర్తీ కాని ఖాళీల నియామకాలకు షెడ్యూల్‌

మతం, విశ్వాసం ప్రాతిపదికన ఆలయ దుకాణాల వేలంలో హిందూయేతరులు పాల్గొనడాన్ని నిరాకరించడం సబబుకాదని పేర్కొంది. ఆలయ ప్రాంగణాల్లో మత విశ్వాసాలకు విఘాతం కలిగించే మద్యం, గ్యాంబ్లింగ్‌ వంటివి అనుమతించరాదుగానీ పూలు, పళ్లు, చిన్నపిల్లల ఆటబొమ్మలకు సంబంధించిన దుకాణాల వేలంలో హిందూయేతరులను అనుమతించకపోవడం సరికాదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. శ్రీశైలం భ్రమరాంబ మలికార్జునస్వామి ఆలయ దుకాణాలు, దుకాణ సముదాయాల వేలంలో హిందుయేతరులనూ అనుమతించాలని స్పష్టం చేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.

మరిన్ని వార్తలు