ఇక వడ దడ!

27 Mar, 2021 03:26 IST|Sakshi

నేటి నుంచే ప్రభావం.. రేపటి నుంచి మరింత తీవ్రం 

పలుచోట్ల 4–6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం 

విజయనగరం, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలపై ఎక్కువ ప్రభావం

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో వడగాడ్పులు దడ పుట్టించనున్నాయి. వీటి ప్రభావం శనివారం నుంచే మొదలు కానున్నప్పటికీ ఆదివారం నుంచి మరింత ఉధృతరూపం దాల్చనున్నాయి. మొత్తం 670 మండలాలకు గాను శనివారం వివిధ జిల్లాల్లోని 94 మండలాలు, ఆదివారం 102 మండలాల్లోను వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది.

అదే సమయంలో విజయనగరం, విశాఖపట్నం, ఆయా ప్రాంతాల్లో సాధారణం కంటే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ప్రధానంగా తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 36 మండలాలు, విజయనగరం జిల్లాలో 34, పశ్చిమ గోదావరిలో 32, కృష్ణాలో 30, విశాఖపట్నంలో 22, శ్రీకాకుళంలో 20కి పైగా మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రతలు రికార్డు కానున్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 1నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల మరింత అధికమవుతుందని, వడగాడ్పుల ప్రభావమూ పెరుగుతుందని చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు