‘శ్రీశైలం’లో ఆగని తెలంగాణ ‘దోపిడీ’ 

5 Sep, 2021 04:50 IST|Sakshi

కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కిన తెలంగాణ సర్కార్‌ 

ఎడమగట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి 

రోజూ సగటున మూడు టీఎంసీలు దిగువకు తరలింపు 

సాగర్, పులిచింతల్లోనూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తున్న వైనం 

దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 120 టీఎంసీలు వృథాగా కడలిలోకి 

తెలంగాణ తీరుతో రెండు రాష్ట్రాల రైతులకు ఇబ్బందులేనంటున్న నిపుణులు 

సాక్షి, అమరావతి: ఓవైపు కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. మరోవైపు రైతుల ప్రయోజనాలకు గండికొడుతూ శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్‌ అక్రమంగా నీటిని వాడుకుంటూ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తోంది. ఈనెల 1న కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణ తీరును బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ తప్పుపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడు.. తమ అనుమతి తీసుకుని మాత్రమే విద్యుదుత్పత్తి చేయాలని ఆదేశించారు. కానీ ఆ రాష్ట్రం ఆయన ఆదేశాలను తుంగలో తొక్కుతోంది. శనివారం ఎడమగట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు మూడు టీఎంసీలను తరలించింది. నాగార్జునసాగర్‌లోగరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉండటంతో దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకపోయినా విద్యుదుత్పత్తి చేస్తూ.. 

అదే స్థాయిలో నీటిని దిగువకు వదిలేస్తోంది. పులిచింతలలోనూ ఇలాగే చేస్తోంది. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే కావడంతో.. కృష్ణా డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న నీటిని సముద్రంలోకి వదిలేయాల్సిన దుస్థితి. ఇలా జూన్‌ 2 నుంచి ఇప్పటివరకు శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేయడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 120 టీఎంసీలకుపైగా వృథాగా సముద్రంలో కలిశాయి. తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తి చేయకపోతే ఆ జలాలను రెండు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉండేదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం రాకపోతే శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవాలతోపాటు తెలంగాణలో కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టు రైతులకు నీటి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. 

ఖాళీ అవుతున్న శ్రీశైలం.. 
శ్రీశైలంలో నీటిమట్టం డెడ్‌ స్టోరేజీ స్థాయిలోఉన్నప్పటికీ జూన్‌ 2 నుంచే తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదుతో స్పందించిన కృష్ణా బోర్డు విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదిలోనే ఆదేశించింది. కానీ.. తెలంగాణ సర్కార్‌ వాటిని బేఖాతరు చేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, ప్రధాని నరేంద్ర మోదీల దృష్టికి సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకెళ్లారు. కేంద్రం ఆదేశాలను కూడా తెలంగాణ ఖాతరు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తోంది.

ఈ క్రమంలోనే జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. బోర్డు పరిధిపై చర్చించడానికి ఈనెల 1న కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో తక్షణమే విద్యుదుత్పత్తి ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను బోర్డు చైర్మన్‌ ఆదేశించారు. అయినా యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండటంతో శ్రీశైలంలో నీటి నిల్వ 873.62 అడుగుల్లో 157.10 టీఎంసీలకు తగ్గిపోయింది. కృష్ణా బేసిన్‌లో ఈ నెలాఖరు వరకే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇలా జరిగితేనే ఎగువ నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం వస్తుంది.. లేకుంటే రాదు. 

తెలంగాణ సర్కార్‌కు జరిమానా విధించాలి.. 
కృష్ణా బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్‌ ఉల్లంఘించి.. శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తోంది. ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని మరోసారి బోర్డును కోరతాం. నిబంధనలు ఉల్లంఘించినందుకు విభజన చట్టం ప్రకారం.. జరిమానా విధించాలని డిమాండ్‌ చేస్తాం. తెలంగాణ తీరు వల్ల రెండు రాష్ట్రాల్లోనూ శ్రీశైలంపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు నీటికొరత ఏర్పడే ప్రమాదం ఉంది.  
– సి.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు