5జీ స్పెక్ట్రం వేలం, బరిలో వ్యాపార దిగ్గజాలు!

13 Jul, 2022 07:11 IST|Sakshi

వేలం బరిలో జియో, ఎయిర్‌టెల్, ఐడియా 

జాబితా విడుదల చేసిన టెలికం శాఖ 

న్యూఢిల్లీ: త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు అదానీ డేటా నెట్‌వర్క్స్, రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా దరఖాస్తు చేసుకున్నాయి. టెలికం శాఖ (డాట్‌) ఈ మేరకు నాలుగు సంస్థల జాబితాను మంగళవారం విడుదల చేసింది. 600 మెగాహెట్జ్‌ మొదలుకుని 3,300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్‌ వరకూ వివిధ ఫ్రీక్వెన్సీల్లో స్పెక్ట్రం కోసం అప్లికేషన్లు  వచ్చినట్లు వివరించింది. డాట్‌ పోర్టల్‌లో పొందుపర్చిన సమాచారం ప్రకారం.. బిడ్డింగ్‌కు అర్హత పొందడానికి సంబంధించి ఏడీఎన్‌ రూ. 248 కోట్ల నికర విలువను చూపించింది. 

ఈ విషయంలో ఏడీఎన్‌లో 100 శాతం వాటాదారైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏఈఎల్‌) నికర విలువను (రూ.4,731 కోట్లు) కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటి గణాంకాల ప్రకారం జియో ఇన్ఫోకామ్‌ రూ. 1,97,790 కోట్ల నికర విలువ చూపించింది. అటు ఎయిర్‌టెల్‌ నికర విలువ రూ. 75,887 కోట్లుగా ఉండగా, వొడాఫోన్‌ ఐడియాది మైనస్‌ రూ. 80,918 కోట్లుగా ఉంది. ఐడియాలో బిర్లా గ్రూప్‌నకు 27.38 శాతం, బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌కు 47.61 శాతం వాటాలు ఉన్నాయి.

దరఖాస్తులను ఉపసంహరించుకోవడానికి జూలై 19 ఆఖరు తేది. జూలై 26న వేలం ప్రారంభమవుతుంది. సుమారు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72,097.85 మెగాహెట్జ్‌ పరిమాణంలో స్పెక్ట్రంను కేంద్రం వేలం వేస్తోంది. జియో,  ఎయిర్‌టెల్, టెలికంలోకి ఎంట్రీ ఇస్తున్న అదానీ ఈ వేలంలో పోటాపోటీగా బిడ్లు వేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

అదానీ ఎంట్రీపై సందేహాలు.. 
పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ తమ ఎయిర్‌పోర్టులు, విద్యుత్, డేటా సెంటర్లు తదితర సొంత వ్యాపార అవసరాల కోసం ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రం కొనుగోలు చేయాలని యోచిస్తోంది. వీటికి లైసెన్సు ఫీజు లేకుండా, నామమాత్రం రేటుకే నేరుగా స్పెక్ట్రంను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్‌ సంస్థలకు కేంద్రం వెసులుబాటు ఇస్తున్నప్పటికీ అదానీ గ్రూప్‌.. స్పెక్ట్రం వేలంలో ఎందుకు పాల్గొంటోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు