ఎయిర్‌ ఇండియా సేల్‌- గడువు పెంపు

26 Aug, 2020 11:37 IST|Sakshi

కొనుగోలుకి ఆసక్తి కలిగిన సంస్థలకు ప్రభుత్వ ఆహ్వానం 

అక్టోబర్‌ 30 వరకూ బిడ్స్‌ దాఖలు చేయవచ్చు

ఎయిర్‌ ఇండియాలో 100 శాతం వాటా విక్రయం

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లోనూ అమ్మకానికి పూర్తి వాటా

రేసులో టాటా గ్రూప్‌, తదితర కంపెనీలు!

విమానయాన సేవల పీఎస్‌యూ దిగ్గజం ఎయిర్‌ ఇండియాలో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా రెండు నెలలపాటు గడువు పెంచింది. దీంతో ఆసక్తి కలిగిన సంస్థలు అక్టోబర్‌ 30లోగా కొనుగోలుకి బిడ్స్‌(ఈవోఐ) దాఖలు చేయవచ్చని తెలియజేసింది. కోవిడ్‌-19 కారణంగా తలెత్తిన సవాళ్ల నేపథ్యంలో ఆసక్తి వ్యక్తం చేస్తున్న కంపెనీల అభ్యర్ధనలమేరకు గడువును పొడిగించినట్లు ప్రభుత్వ శాఖ దీపమ్‌(డీఐపీఏఎం) పేర్కొంది. వెరసి ఎయిర్‌ ఇండియాలో వాటా విక్రయానికి జనవరి నుంచి మూడోసారి గడువును పొడిగించింది. నవంబర్‌ 20కల్లా అర్హత సాధించిన బిడ్స్‌ వివరాలను వెల్లడించగలమని దీపమ్‌ పేర్కొంది.

తొలుత 76 శాతమే
ప్రభుత్వం ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాలో 100 శాతం వాటాను విక్రయానికి ఉంచింది. దీంతోపాటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లోనూ పూర్తి వాటాను అమ్మకానికి పెట్టింది. తొలుత ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటాను మాత్రమే డిజిన్వెస్ట్ చేయాలని భావించినప్పటికీ బిడ్డర్లు ముందుకు రాకపోవడంతో పూర్తి వాటాను విక్రయించేందుకు నిర్ణయించింది. కాగా.. జనవరి 27న తొలుత మార్చి 31వరకూ ఈవోఐలకు గడువును ప్రకటించింది. తదుపరి జూన్‌ 30కు పెంచగా.. ఆపై ఆగస్ట్‌ 30వరకూ చివరి తేదీని పొడిగించింది. 

సాధ్యాసాధ్యాలు..
ఎయిర్‌ ఇండియా కొనుగోలుకి టాటా గ్రూప్‌ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసుకుంటున్నట్లు మీడియా పేర్కొంది. ఎయిర్‌ ఇండియా కొనుగోలుకి ఆర్థికపరంగా ఎలాంటి భాగస్వామ్యానికీ తెర తీయకపోవచ్చని సంబంధితవర్గాలు చెబుతున్నాయి. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లతోపాటు.. గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ కంపెనీ ఏఐఎస్‌ఏటీఎస్‌లో సైతం 50 శాతం వాటాను పభుత్వం విక్రయించనుంది. ప్రభుత్వం ఎయిర్‌ ఇండియా రుణ భారాన్ని రూ. 23,286 కోట్లకు కుదించినట్లు మీడియా తెలియజేసింది.

మరిన్ని వార్తలు