మొండిబకాయిలు.. 10 లక్షల కోట్లు దాటిపోతాయ్‌!

15 Sep, 2021 01:56 IST|Sakshi

2022 మార్చి నాటికి బ్యాంకింగ్‌పై ఎన్‌పీఏల భారం

ఎంఎస్‌ఎంఈ, రిటైల్‌ నుంచి పెరగనున్న ‘డిఫాల్ట్‌’లు

అసోచామ్, క్రిసిల్‌ అధ్యయనం

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ మొండిబకాయిలు స్థూలంగా  (జీఎన్‌పీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసే నాటికి రూ. 10 లక్షల కోట్లు దాటిపోతాయని ఇండస్ట్రీ బాడీ అసోచామ్, రేటింగ్స్‌ సంస్థ– క్రిసిల్‌ తన అధ్యయనంలో పేర్కొన్నాయి. రిటైల్‌తో పాటు, సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నుంచి మొండిబకాయిలు పెరిగే అవకాశం ఉందని అధ్యయన నివేదిక పేర్కొనడం కొంత ఆందోళన కలిగించే అంశం. ‘రీఎన్‌ఫోర్సింగ్‌ ది కోడ్‌’ శీర్షికన ఆవిష్కరించిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... 

మార్చి 2022 నాటికి ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 8.5 శాతం నుంచి 9 శాతానికి పెరిగే అవకాశం ఉంది. దీనికితోడు పునర్‌వ్యవస్థీకరించిన కొన్ని అకౌంట్ల నుంచి సైతం ‘డిఫాల్ట్‌’లు చోటుచేసుకునే అవకాశం ఉంది.  

గత కొన్నేళ్ల క్రితం చోటుచేసుకున్న మొండిబకాయిల అకౌంట్లతో పోల్చితే ప్రస్తుత ధోరణి భిన్నంగా ఉంది. గతంలో ఎన్‌పీఏలు బడా కార్పొరేట్లకు చెందినవి అవి ఉండేవి. ఇప్పుడు ఎంఎస్‌ఎంఈ, రిటైల్‌ రంగాల్లో  ఎన్‌పీఏలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడా కార్పొరేట్లకన్నా ఈ విభాగాల్లో ఎన్‌పీఏ సమస్యలు తీవ్రంగా ఉండవచ్చు. బడా కంపెనీల బ్యాలెన్స్‌షీట్స్‌ పటిష్ట మయ్యాయి. 

పెరగనున్న ఎన్‌పీఏ సమస్యలు దివాలా కోడ్‌ (ఐబీసీ) పటిష్టత, సామర్థ్యాలను పరీక్షకు నిలపనున్నాయి. మహమ్మారి సవాళ్ల నుంచి గట్టెక్కించడానికి ప్రకటించిన పలు విధానపరమైన చర్యలు వెనక్కు తీసుకునే అవకాశాలు ఉండడంతో కంపెనీలు దివాలా సమస్యలు కూడా తీవ్రం కానున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌తో పాటు, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల స్థూల ఎన్‌పీఏలు కూడా పెరిగే అవకాశాలే ఉన్నాయి.

బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2021–22లో పెరిగినప్పటికీ, 2018 మార్చి నాటి తీవ్రత ఉండకపోవచ్చు. ప్రభుత్వ నుంచి అందుతున్న పలు సహాయక చర్యలు దీనికి కారణం. ఆరు నెలల రుణ మారటోరియం, అత్యవసర రుణ హామీ పథకం, రుణ పునర్‌వ్యవస్థీకరణ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు.
 
భారత్‌ బ్యాంకుల్లో ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రిస్క్‌ను తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం  ఇప్పుడు ఎంతో మెరుగుపడింది.

గతంలో నిబంధనలు రుణదాతలకు అనుకూలంగా ఉండేవికావు. ఇది ప్రమోటర్లు ఉద్దేశపూర్వక మోసాలకు పాల్పడ్డానికి ఇవి దోహదం చేసేవి. దీనివల్లే అధిక సంఖ్యలో ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు తయారయ్యారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలను కఠినతరం చేసింది. రిజల్యూషన్‌ ప్రణాళికలతో పాటు, ఐబీసీ ఫ్రేమ్‌వర్క్‌ ఎన్‌పీఏలను సమర్థవంతంగా రికవరీ చేసుకోడానికి దోహదపడుతోంది.    

మరిన్ని వార్తలు