క్రాష్‌ టెస్ట్‌తో వాహనాలకు రేటింగ్‌

25 Jun, 2022 06:37 IST|Sakshi

భారత్‌ ఎన్‌సీఏపీ ముసాయిదా నోటిఫికేషన్‌

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: ఏ కారు ప్రయాణానికి భరోసా ఇస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే కార్ల యజమానులు 10 శాతం మంది కూడా ఉండరు. స్టార్‌ రేటింగ్‌ గురించి తెలిసింది తక్కువే. ఇక మీదట క్రాష్‌ టెస్టుల్లో కార్లు చూపించే భద్రతా సామర్థ్యాలకు అనుగుణంగా వాటికి స్టార్‌ రేటింగ్‌ను ఇచ్చే ‘భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’(భారత్‌–ఎన్‌సీఏపీ)కు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌పై సంతకం చేసినట్టు ప్రకటించారు.

స్టార్‌ రేటింగ్‌ల ఆధారంగా వినియోగదారులు సురక్షితమైన కార్లను ఎంపిక చేసుకునే వీలుంటుందని మంత్రి చెప్పారు. సురక్షిత వాహనాలను తయారు చేసే దిశగా ఓఈఎం తయారీదారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ఈ విధానం ప్రోత్సహిస్తుందన్నారు. ఇప్పటివరకు మన దేశంలో తయారవుతున్న కార్లు గ్లోబల్‌ ఎన్‌సీఏపీ రేటింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశ రహదారులు, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ప్రామాణిక క్రాష్‌ టెస్టింగ్‌ విధానం మనకు లేదు.

ఇక మీదట రేటింగ్‌ కోసం గ్లోబల్‌ ఎన్‌సీఏపీపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని మంత్రి గడ్కరీ చెప్పారు. భారత కార్లకు స్టార్‌ రేటింగ్‌   ప్రయాణికుల భద్రత కోసమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లకు మన కార్లను ఎగుమతి చేసుకునేందుకూ ఉపయోగపడుతుందన్నారు.  ‘భారత్‌–ఎన్‌సీఏపీ పరీక్షా ప్రొటోకాల్‌ అంతర్జాతీయ ఎన్‌సీఏపీ ప్రొటోకాల్‌కు అనుగుణంగానే, భారత్‌ నిబంధనల పరిధిలో ఉంటుంది. భారత్‌కు చెందిన సొంత టెస్టింగ్‌ సదుపాయాల్లో ఓఈఎంలు (తయారీ కంపెనీలు) వాటి వాహనాలను పరీక్షించుకునేందుకు అనుమతించనున్నాం’’అని గడ్కరీ చెప్పారు.

క్రాష్‌ టెస్ట్‌ అంటే..?
వాహనంలో ప్రయాణించే వారికి భద్రత పాళ్లు ఏ మేరకో క్రాష్‌ టెస్ట్‌లో తేలిపోతుంది. భిన్న రకాల క్రాష్‌ టెస్ట్‌లు జరుగుతుతాయి. ముందు భాగం, పక్క భాగం, వెనుక భాగం, రోడ్డుపై నుంచి అదుపు తప్పి పక్కకు పోవడం, పెడెస్ట్రెయిన్‌ సేఫ్టీ టెస్ట్‌ (నడిచి వెళ్లేవారికి భద్రత) ఇలా పలు పరీక్షలు నిర్వహిస్తారు. రెండు కార్లు ఢీకొనడం లేదంటే ఒక కారు ఒక అవరోధాన్ని డీకొనడం ద్వారా నష్టాన్ని, భద్రతను అంచనా వేస్తారు. మారుతి సుజుకీ ఎస్‌ ప్రెస్సో, కియా సెల్టోస్, హ్యుందాయ్‌ ఐ10 నియోస్‌ గ్లోబల్‌ ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌లో బలహీన పనితీరు చూపించిన వాటిల్లో కొన్ని. ఇప్పటి వరకు ఈ విధానం తప్పనిసరేమీ కాదు. స్వచ్ఛందంగా అమలవుతున్నదే. భారత్‌ ఎన్‌సీఏపీలోనూ ఇది స్వచ్ఛందంగానే ఉండనుందని తెలుస్తోంది.  

భద్రతా సదుపాయాలు
కార్లు ఏబీఎస్, ఈఎస్‌పీ, ఎయిర్‌బ్యాగులు, పవర్‌ విండోలు, డెడ్‌ పెడల్స్, పెరీమీటర్‌ అలార్మ్‌ తదితర ఫీచర్లతో వస్తున్నాయి. ఇవన్నీ భద్రతా ఫీచర్లే. సాధారణంగా భద్రత రెండు రకాలు. ముందస్తు భద్రత, ప్రమాదం జరిగిన వెంటనే భద్రత. ఇందులో ఏబీఎస్, ఈఎస్‌పీ, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్‌ కంట్రోల్, ఏఐ ఆధారిత బ్రేకింగ్‌ ఇవన్నీ ముందస్తు భద్రతకు సంబంధించినవి. ఇవన్నీ కారు తయారీ వ్యయాన్ని పెంచేవి.

అందుకనే వ్యయాలను పరిమితం చేసేందుకు బేసిక్‌ మోడళ్లలో కంపెనీలు వీటిలో కొన్నింటికే చోటు కల్పిస్తున్నాయి. ఎయిర్‌ బ్యాగులు, బలమైన చాసిస్, ఆటోమేటిక్‌ ఎస్‌వోఎస్‌ ఇతర సదుపాయాలు ప్రమాదం తర్వాత భద్రతకు సంబంధించినవి. ప్రయాణికుల కార్లలో సీటు బెల్ట్‌ తప్పకుండా ఉండాలి. వేగం పరిమితి మించితే అప్రమత్తం చేసే అలర్ట్‌ ఫీచర్‌ ఉండాలి. రివర్స్‌ గేర్‌ సెన్సార్‌ ఉండాలి. ఏబీఎస్, ఎయిర్‌ బ్యాగులు ఇవన్నీ తప్పనిసరే. కానీ, ఎయిర్‌బ్యాగుల నిబంధన ఇంకా అన్ని వాహనాలకు అమల్లోకి రాలేదు.  
 

మరిన్ని వార్తలు