ఐటీ కంపెనీలకు కలిసొచ్చిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. కోట్లలో డబ్బు ఆదా

7 Jul, 2021 14:52 IST|Sakshi

2020-21లో 70 శాతం వరకు ఆదా 

టీసీఎస్, ఇన్ఫోసిస్‌కు భారీ మిగులు

ముంబై: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (ఇంటి నుంచే కార్యాలయ పని) విధానం కార్పొరేట్లకు బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలకు రూ.వేలాది కోట్లను ఆదా చేసింది. ఎలా అనుకుంటున్నారా..? ఉద్యోగులు ఇంటి నుంచి కార్యాలయానికి వచ్చి వెళ్లేందుకు కంపెనీలు రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంటాయి. లేదా రవాణా భత్యాలను ఇస్తుంటాయి. వ్యాపార అవసరాల రీత్యా ఉద్యోగులు, ఉన్నతాధికారులు చేసే ప్రయాణాలు కూడా ఉంటాయి. కానీ, 2020లో కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఇంటి నుంచే పని విధానాన్ని కంపెనీలు తప్పనిసరిగా ఆచరణలోకి తీసుకొచ్చాయి. ప్రయాణాలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. 

ఫలితంగా రవాణాపై చేసే వ్యయాలు కంపెనీలకు గణనీయంగా తగ్గిపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా కంపెనీలకు రవాణా వ్యయాలు 70 శాతం వరకు తగ్గాయి. ఈటీఐజీ డేటాబేస్‌లో అందుబాటులోని సమాచారం ఆధారంగా.. 180 కంపెనీలకు సంబంధించిన వివరాలతో ఈ మేరకు ఓ నివేదిక విడుదలైంది. గతేడాది మార్చి చివరి నుంచి మే వరకు కఠిన లాక్‌డౌన్‌లు, ప్రయాణాలపై ఆంక్షలు దేశవ్యాప్తంగా అమలైన విషయం తెలిసిందే. ఆ సమయంలో సేవల రంగంలోని చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను సజావుగా సాగించేందుకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం ఎంతో తోడ్పడిందని చెప్పుకోవాలి.  

ఐటీ కంపెనీలకే ఎక్కువ లబ్ధి 
ఐటీ దిగ్గజం టీసీఎస్‌ 2019-20 ఆర్థిక సంవత్సరంలో రవాణాపై రూ.3,296 కోట్లను వ్యయం చేసింది. కానీ, 2020-21లో రవాణా వ్యయాలు రూ.1,081 కోట్లకు పరిమితమయ్యాయి. అంటే ఏకంగా రూ.2,215 కోట్లు రవాణా రూపంలో కంపెనీకి మిగిలినట్టయింది. అంటే 67 శాతం ఆదా అయ్యింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు కూడా గత ఆర్థిక సంవత్సరంలో రవాణా వ్యయాలు 70 తగ్గిపోయాయి. 2019-20లో రవాణా కోసం రిలయన్స్‌ రూ.788 కోట్లు ఖర్చు చేయగా.. 2020-21లో రూ.236 కోట్లకు తగ్గిపోయింది. 

ముఖ్యంగా బజాజ్‌ ఆటో సంస్థ అయితే రవాణా వ్యయాల్లో 93 శాతాన్ని ఆదా చేసుకుంది. 2019-20లో ఈ సంస్థ రవాణాపై రూ.77 కోట్లు వ్యయం చేయగా.. 2020-21లో ఈ వ్యయాలు రూ.6 కోట్లకు పరిమితమయ్యాయి. ‘‘కీలకమైన పనులు డిజిటల్‌ రూపంలోనే కొనసాగుతున్నాయి. ఒప్పందాలపై సంతకాలు లేదా పెద్ద కాంట్రాక్టులు ఏవైనా డిజిటల్‌ రూపంలో నమోదవుతున్నాయి. కనుక ‘ఎందుకు ప్రయాణించడం’ అనే నినాదం గ్రూపు కంపెనీల పని విధానాన్నే మార్చేసింది. అవసరమైన ప్రయాణాలకే పరిమితమవుతున్నాం. గతంలోని పనివిధానానికి తిరిగి వెళ్లే అవకాశం లేదు’’ అని టాటా గ్రూపు అధికారి తెలిపారు. 

ఫార్మాకు ఆ వెసులుబాటు లేదు.. 
‘‘ఫార్మా వంటి పరిశ్రమలు ప్రయాణాలను ప్రారంభించక తప్పదు. మా తరహా వ్యాపారాలకు ప్రయాణాలు ముఖ్యమవుతాయి. తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఆడిట్‌ వెండర్లు, కస్టమర్లను కలవాల్సిన అవసరం ఉంటుంది’’అని బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌షా తెలిపారు. రానున్న కాలంలో రవాణా, మార్కెటింగ్‌ వ్యయాల్లో పెద్ద ఎత్తున ఆదా ఉండకపోవచ్చని ఆమె స్పష్టం చేశారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు