దేశంలో మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన సీబీఐ | Sakshi
Sakshi News home page

దేశంలో మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన సీబీఐ

Published Mon, Nov 1 2021 9:39 PM

CBI registers FIR against UP Based firm in multi crore Bike Bot scam - Sakshi

వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో సంబంధం ఉన్న గార్విట్ ఇన్నోవేటివ్ ప్రమోటర్స్ లిమిటెడ్(జీఐపీఎల్), ఆ కంపెనీ యజమాని సంజయ్ భాటిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన బైక్ బాట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ భాటి, మరో 14 మంది కలిసి దేశవ్యాప్తంగా సుమారు రూ.15,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులను మోసం చేశారని ఆ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది  ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన సంజయ్‌ భాటి బైక్ బాట్ పేరుతో బైక్-టాక్సీ సర్వీసులను ప్రారంభించాడు. 

ఈ బైక్ సర్విస్ ముసుగులో లాభదాయకమైన మోసపూరిత ఆర్థిక పథకాలను రూపొందించాడు. ఈ బైక్‌ టాక్సీ సర్వీసుల్లో బైక్‌ బాట్‌ వాహనాన్ని ఎవరైనా కొనుగోలుదారుడు తమ వద్ద ఉన్న డబ్బుతో ఒకటి, మూడు, ఐడు లేదా ఏడు బైక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బైక్‌లను తమ కార్పొరేట్‌ కార్యాలయమే నడుపుతుందని నమ్మించారు. ఇలా పెట్టుబడి పెట్టినవారికి నెలవారీ అద్దె, ఈఎంఐతో పాటు ఎక్కువ బైక్‌లపై పెట్టుబడి పెడితే బోనస్‌ కూడా ఇస్తామంటూ ఆసక్తికరమైన ప్రోత్సాహకాలతో ఆకట్టుకున్నారు. కంపెనీ వివిధ నగరాల్లో ఫ్రాంచైజీలను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ నగరాల్లో బైక్‌లు టాక్సీలు పెద్దగా పనిచేయడం లేదని సీబీఐ పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా బైక్‌ టాక్సీల్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడి దారులు మోసపోయినట్టు సీబీఐ గుర్తించింది.

(చదవండి: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌: బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్‌!)

2017లో ఈ పథకాలను ప్రారంభించిన ఈ సంస్థ.. పెట్టుబడిదారుల నుంచి డబ్బు వసూలు చేయడం, వేరేవారికి తిరిగి చెల్లించడం వంటివి చేస్తూ 2019 జనవరి వరకు చేసింది. నవంబర్ 2018లో పెట్రోల్ బైక్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ ఎలక్ట్రిక్-బైక్ కోసం కంపెనీ ఇదే విధమైన ప్రణాళికను ప్రవేశపెట్టింది. సాధారణ పెట్రోల్ బైక్ లతో పోలిస్తే ఈ-బైక్ల సబ్ స్క్రిప్షన్ మొత్తం దాదాపు రెట్టింపు అని ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించడానికి 'బైక్ బాట్ - జీఐపీఎల్ పథకం ద్వారా నడిచే బైక్ టాక్సీ అతి త్వరలో వేయనున్నాము. ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలనే వ్యక్తులు త్వరగా డబ్బును డిపాజిట్ చేయాలి' అని కంపెనీ ప్రచారం చేసింది. 

కేవలం రూ.62,200 పెట్టుబడి పెట్టి అద్దె పొందవచ్చునని, ఏడాదిలోగా బైక్‌ ఓనర్‌గా మారవచ్చు అని అందరినీ నమ్మించింది. ఇలా రూ.62,000 పెట్టుబడి పెట్టిన వారికి 12 నెలలపాటు నెలకు రూ.9,765 చొప్పున అందిస్తామని ఆశపెట్టింది. ఇలా ఏడాదికి రూ.1,17,000 సంపాదించవచ్చు అని తెలిపింది. ఈ ప్రకటన చూసి సుమారు 2,25,000 మంది ఇందులో పెట్టుబడి పెట్టారు. అయితే, కొన్నాళ్ల తర్వాత నెలలు గడుస్తున్నా అద్దెతో పాటు ఈఎంఐ చెల్లింపులు, బోనసులు రాకపోవడంతో పెట్టుబడిదారుల్లో అనుమానాలు వచ్చాయి. అప్పుడిస్తాం, ఇప్పుడిస్తాం అని భారీ మొత్తం లాగేసుకున్నాక బోర్డు తిప్పేశారు. అయితే, ఈ కంపెనీ నోయిడా జిల్లా అథారిటీ, పోలీసు అధికారుల పరిధిలో ఉంది.

(చదవండి: రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లు)

ఇంత జరుగుతున్న అక్కడి పోలీసు అధికారులు ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. "బదులుగా, ఎస్ఎస్ పి, ఎస్ పీ క్రైమ్ బ్రాంచ్ ఫిర్యాదుదారుల ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు" సీబీఐ తెలిపింది. సంజయ్ భాటి, అతని సహచరులు పెట్టుబడిదారులను నుంచి ముందస్తు కుట్రలో భాగంగా దేశవ్యాప్తంగా కనీసం 15,000 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించింది. అయితే, ఇంతకు ముందు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జీఐపీఎల్, దాని ప్రమోటర్ భాటి, ఇతరులకు వ్యతిరేకంగా గౌతమ్ బుద్ధనగర్ లోని దాద్రీ పోలీస్ స్టేషన్ లో నమోదైన వివిధ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా బైక్ బాట్ కుంభకోణం మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసులో ఆర్థిక దర్యాప్తు సంస్థ 216 కోట్లకు పైగా ఆస్తులను కూడా అటాచ్ చేసింది.

Advertisement
Advertisement