పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి? మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు ఆఫర్‌ చేసే చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్లు లాభదాయకమేనా?

7 Mar, 2022 10:35 IST|Sakshi

నేను ఏటా ఒక లక్ష రూపాయల చొప్పున 15 ఏళ్లపాటు సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. ఇది ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇస్తుందా? – సుధాకర్‌ 
దీనికి జవాబు తెలుసుకోవడానికి ముందు నిప్పన్‌ ఇండియా ఈటీఎఫ్‌ గోల్డ్‌బీస్‌ పథకాన్ని ఒక సారి పరిశీలించాలి. గోల్డ్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పథకం ఇది. ఇందులో రాబడులు 10 శాతానికి పైనే ఉన్నాయి. ఇది మంచి రాబడే. కానీ ఇదే ఈటీఎఫ్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు అయితే రాబడుల్లో అధిక శాతం గడిచిన నాలుగేళ్లలోనే వచి్చనట్టు గుర్తించొచ్చు. అంటే బంగారం అన్నది ఎంతో అస్థిరమైన పెట్టుబడి సాధనంగా అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈ పథకం ప్రతికూల పనితీరు చూపించిన కాలాలను పరిశీలించినా.. ఒక వారంలో 13 శాతం నష్టం, ఒక ఏడాదిలో 20 శాతం నష్టం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే బంగారం ధరలు ఒక వారంలో 13 శాతం, ఒక ఏడాదిలో 20 శాతం పడిపోతాయని అర్థం చేసుకోవచ్చు. చాలా మంది బంగారంలో పెట్టుబడి మంచిదని భావిస్తుంటారు. కానీ, ఇది కూడా ఒక అస్థిరతలతో కూడిన సాధనం. బంగారంపై రాబడి ద్రవ్యోల్బణానికి దీటుగా ఉండకపోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడినిచ్చేది అయితే అది ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. కానీ బంగారం అన్నది లాకర్‌లో ఉండేది. ప్రధానంగా డిమాండ్, సరఫరా దీని ధరలను నిర్ణయిస్తుంటుంది. మార్కెట్లు కుప్పకూలుతున్న తరుణంలో పెట్టుబడులకు సంబంధించి ఆకర్షణీయమైన సాధనం ఇది. మార్కెట్లు పడుతున్న సమయాల్లో బాండ్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లలోనూ.. కంపెనీలు దివాలా తీస్తే తమ పెట్టుబడి వెనక్కి రాదన్న ఆందోళన ఉంటుంది. బంగారం మంచి పెట్టుబడి సాధనం కాదు. ప్రపంచ భవిష్యత్తు విషయమై మీరు ఆశావహంగా ఉంటే బంగారంలో ఇన్వెస్ట్‌ చేయకూడదు.  
పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి? మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు ఆఫర్‌ చేసే చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్లు లాభదాయకమేనా? – ఆశా 
పేర్లను చూసి అనుసరించడం కానీ, మోసపోవడం కానీ చేయవద్దు. చిన్నారి కోసం పెట్టుబడులు పెడుతున్నట్టు అయితే అది చేతులు దులుపుకునేట్టు ఉండకూడదు. మీ పిల్లల కోసం ఏ తరహా పెట్టుబడి అనుకూలంగా ఉంటుంది? వారు చాలా చిన్న వయసులోనే ఉంటే ఈక్విటీ ఫండ్స్‌ అనుకూలం. మీరు తగినంత అనుభవం ఉన్న ఇన్వెస్టర్‌ అయితే వీలైనంత ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ తీసుకోవచ్చు. 10–12 ఏళ్లపాటు పిల్లల కోసం ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత వారు కాలేజీలోకి అడుగు పెట్టే సమయం వస్తుంది. దానికంటే మూడేళ్ల ముందు సన్నద్ధం కావాలి. మొదటి సంవత్సరం కాలేజీకి కోసం కావాల్సిన మొత్తాన్ని మూడేళ్ల ముందే వెనక్కి తీసుకోవాలి. కాలేజీ రెండో సంవత్సరం కోసం కావాల్సిన మొత్తాన్ని ఏడాది విరామం తర్వాత తీసుకోవాలి. అప్పుడే మార్కెట్‌ పరిస్థితులపై ఆధారపడాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఎవరైనా కానీ, పిల్లల విద్య కోసం ఈక్విటీల్లో మదుపు చేస్తున్నట్టు అయితే ఈ విధానాన్ని అనుసరించొచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీలు ఆఫర్‌ చేసే చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్‌లు అంత అర్థవంతమైనవి కావు. ఎందుకంటే అనవసరమైన నిర్బంధాలు వీటిల్లో ఉండడమే. తాను పిల్లల కోసం పెట్టుబడులను చైల్డ్‌ ఫండ్‌లోనే పెడుతున్నానన్న భావనతో చాలా మంది ఉంటారు. కానీ, మంచి పథకం ఎంపిక చేసుకోతగిన సామర్థ్యం మీకు ఉంటే, తగినంత క్రమశిక్షణతో వ్యవహరించేట్టు అయితే అప్పుడు ఎటువంటి ప్రతికూలతలు కనిపించవు. ఏ ఫండ్‌ అయినా చైల్డ్‌ ఫండ్‌గా అనిపిస్తుంది.

 
- ధీరేంద్ర కుమార్‌ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్)
 

మరిన్ని వార్తలు