స్మాల్‌క్యాప్‌ నుంచి పెట్టుబడుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

22 Nov, 2021 08:06 IST|Sakshi

మార్కెట్లు గణనీయంగా పెరిగి ఉన్నాయి. కనుక స్మాల్‌క్యాప్‌ఫండ్‌లో ఉన్న నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలా?– బీరేంద్ర శర్మ 
మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో లార్జ్‌క్యాప్‌ కంపెనీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్‌ కంపెనీలు మెరుగైన ప్రదర్శన చేస్తాయని మార్కెట్లో ఎక్కువ అంచనాలున్నాయి. కానీ, అటువంటి అంచనాలు మీ నిర్ణయాలను ప్రభావితం చేయరాదు. ఒకరి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు కేటాయింపులు 10–15 శాతానికి మించి ఉండకూడదన్నది నా అభిప్రాయం. ఈ మేరకు కేటాయింపులతో రాబడుల రేటు పెంచుకోవచ్చు. దీర్ఘకాలంలో ఎనిమిదేళ్లు, పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలాల్లో స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ పనితీరును పరిశీలించినట్టయితే.. ఫ్లెక్సీక్యాప్‌ లేదా లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ కంటే చెప్పుకోతగ్గ అంతరంతో అధిక రాబడులు ఇచ్చాయని అర్థమవుతుంది. కనుక ఆ విధంగా చూసుకుంటే స్మాల్‌క్యాప్‌ కేటాయింపులతో పోర్ట్‌ఫోలియో రాబడులను అధికం చేసుకోవచ్చు. అయితే, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ అస్థిరతలతో ఉంటాయి. అందుకే స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌కు మరీ ఎక్కువ కేటాయింపులతో దూకుడుగా వెళ్లడం సూచనీయం కాదు. పోర్ట్‌ఫోలియోలో స్మాల్‌క్యాప్‌ కేటాయింపులను 10–15 శాతానికి పరిమితం చేసుకోవాలి. మీ పోర్ట్‌ఫోలియోను ఒకసారి విశ్లేషించుకుని ఇందుకు అనుగుణంగా మార్పులు చేసుకోండి. ఒకవేళ స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసి ఉన్నారనుకోండి.. ఒకవేళ మీ పెట్టుబడుల కాలవ్యవధి 8–10 ఏళ్లకంటే తక్కువే అనుకుంటే అప్పుడు స్మాల్‌క్యాప్‌ కేటాయింపులను తగ్గించుకోవాలి.
 
స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు డిపాజిట్లు.. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏది మెరుగైన ఆప్షన్‌ అవుతుంది? – అంకిత్‌ జైన్‌ 
రెండింటిలోనూ భద్రత ఉంటుంది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో కాస్త అధిక భద్రత ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడుల పరంగా వైవిధ్య ప్రయోజనం లభిస్తుంది. అదే సమయంలో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు డిపాజిట్‌లో రిస్క్‌ ఉంటుందని కాదు. ఆర్‌బీఐ సూక్ష్మంగా వాటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటుంది. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు కొత్త నమూనా కింద వచ్చినవి. ఇంకా విశ్వసనీయతను సంపాదించుకోవాల్సి ఉంది. అంటే అవి భద్రత లేనివి అని కాదు. డెట్‌ ఫండ్‌లో మీరు రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేస్తే ఆ మొత్తం కూడా 30 డెట్‌ సాధనాల మధ్య విస్తరించి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక్కటి అంచనాలు తప్పినా.. పెట్టుబడుల్లో 5–7 శాతం వాటా మించి ఉండదు. అంటే మీ పెట్టుబడులు మొత్తం రిస్క్‌లో పడినట్టు కాదు. మూడేళ్లకు పైగా ఇన్వెస్ట్‌ చేస్తే డెట్‌ సాధనాల రాబడులపై పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. పైగా వీటిల్లో లిక్విడిటీ అధికం. విక్రయించిన రెండు రోజుల్లో  మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. వీటి మధ్య ఉన్న ఒకే ఒక వ్యత్యాసం.. మెచ్యూరిటీ నాటికి ఎంత మొత్తం వస్తుందో డిపాజిట్స్‌లో తెలుస్తుంది. డెట్‌ ఫండ్స్‌లో రాబడులపై అంచనాకే పరిమితం కావాలి.  

ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తయింది. నా కెరీర్‌ కూడా ప్రారంభమైంది. బ్లూచిప్, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ద్వారా పెట్టుబడులు మొదలుపెట్టాను. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కూడా తీసుకున్నాను. మరింత ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే అందుకు ఏ సాధనాలను సూచిస్తారు? ప్రస్తుతానికి నా వేతనం నుంచి 10 శాతమే పెట్టబడులకు వెళుతోంది?– సాకేత్‌ 
ముందుగా పెట్టుడులను ప్రారంభించినందుకు అభినందనలు. ఇది మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. రానున్న సంవత్సరాల్లో ఈ ఫలితాలను చూస్తారు. పెట్టుబడుల విషయంలో సెక్షన్‌ 80సీ కింద పరిమితి మేరకు ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆ మేరకు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. మూడు లేదా నాలుగు ఫండ్స్‌కు మించి ఇన్వెస్ట్‌ చేయకపోవడమే మంచిది. వైవిధ్యమైన పెట్టుబడులకు ఈ మాత్రం పథకాలు సరిపోతాయి. పెరుగుతున్న మీ వేతనానికి అనుగుణంగా ఆయా పథకాల్లో చేసే పెట్టుబడుల మొత్తాన్ని (సిప్‌ను) కూడా పెంచుకుంటూ వెళ్లండి. కొందరు సరైన వయసులోనే పెట్టుబడులు ప్రారంభిస్తారు. కానీ, క్రమానుగతంగా ఆ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లడంలో వైఫల్యం చెందుతారు. దీన్ని నివారించాలి.  
 
- ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

చదవండి: సీనియర్‌ సిటిజన్‌లకు ‘పన్ను’ లాభాలు

మరిన్ని వార్తలు