టెక్‌ దిగ్గజాల షాక్‌- నాస్‌డాక్‌ పతనం

24 Jul, 2020 10:24 IST|Sakshi

2.3-1.3 శాతం మధ్య మార్కెట్లు డౌన్‌

మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, టెస్లా ఇంక్‌ బోర్లా

అమెజాన్‌, అల్ఫాబెట్‌, నెట్‌ఫ్లిక్స్‌ సైతం డీలా

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, ట్విటర్‌ జూమ్‌

టెక్‌ దిగ్గజాల కౌంటర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో గురువారం యూఎస్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రధానంగా ఫాంగ్‌ స్టాక్స్‌లో అమెజాన్‌, యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌తోపాటు.. మైక్రోసాఫ్ట్‌, టెస్లా పతనంకావడంతో నాస్‌డాక్‌ అత్యధికంగా 245 పాయింట్లు(2.3 శాతం) తిరోగమించింది.10,461 వద్ద ముగిసింది. ఈ బాటలో డోజోన్స్‌ 354 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 26,652కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 40 పాయింట్ల(1.25 శాతం) వెనకడుగుతో 3,236 వద్ద స్థిరపడింది. వెరసి నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది. 

కారణాలివీ
గత వారం నిరుద్యోగ భృతికి దరఖాస్తులు గత నాలుగు నెలల్లోలేని విధంగా 1.416 మిలియన్లకు పెరిగినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. మరోవైపు ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌పై వివిధ రాష్ట్రాలలో వినియోగదారుల పరిరక్షణ అంశాలపై దర్యాప్తు జరగనుందన్న వార్తలు టెక్‌ కౌంటర్లలో అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విభాగం అజ్యూర్‌ ఒక త్రైమాసికంలో తొలిసారి 50 శాతంకంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక వరుసగా నాలుగో త్రైమాసికంలో లాభాలు ప్రకటించినప్పటికీ షేరు ఇటీవల అనూహ్య ర్యాలీ చేయడంతో టెస్లా ఇంక్‌ కౌంటర్లో లాభాల స్వీకరణ తలెత్తినట్లు తెలియజేశారు.

నేలచూపులో
ఎలక్ట్రిక్‌ కార్ల బ్లూచిప్‌ కంపెనీ టెస్లా ఇంక్‌ షేరు 5 శాతం పతనమై 1513 డాలర్లకు చేరగా.. టెక్‌ దిగ్గజాలలో యాపిల్‌ 4.6 శాతం వెనకడుగుతో 371 డాలర్లను తాకింది. మైక్రోసాఫ్ట్‌ 4.6 శాతం పతనమై 203 డాలర్ల దిగువకు చేరగా.. అమెజాన్‌ 3.7 శాతం నష్టంతో 2987 డాలర్ల దిగువన స్థిరపడింది. ఇతర కౌంటర్లలో గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ 3.4 శాతం, ఫేస్‌బుక్‌ 3 శాతం, నెట్‌ఫ్లిక్స్‌ 2.5 శాతం చొప్పున క్షీణించాయి. కాగా.. వచ్చే రెండు నెలల్లో మరిన్ని సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలియజేయడంతో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 3.7 శాతం ఎగసింది. రోజువారీ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగినట్లు వెల్లడించడంతో ట్విటర్‌ 4.1 శాతం జంప్‌చేసింది. 

మరిన్ని వార్తలు