గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు

14 Dec, 2022 02:35 IST|Sakshi

నవంబర్‌లో రూ. 195 కోట్లు వెనక్కి 

న్యూఢిల్లీ: పసిడి ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌(ఈటీఎఫ్‌లు) నుంచి గత నెలలో నికరంగా రూ. 195 కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. అయితే అంతకుముందు రెండు నెలల్లో నికరంగా కొనుగోళ్లే పైచేయి సాధించాయి. వెరసి అక్టోబర్‌లో రూ. 147 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 330 కోట్ల చొప్పున నికరంగా పెట్టుబడులు లభించాయి. ఇక ఆగస్ట్‌లో మాత్రం నికరంగా రూ. 38 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫీ గణాంకాలివి.

గత నెలలో మార్కెట్ల ర్యాలీ నడుమ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చినట్లు ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకులు ప్రీతి రథి గుప్తా పేర్కొన్నారు. అంతేకాకుండా పెళ్లిళ్ల సీజన్‌ కారణంగా కుటుంబాల నుంచి పసిడికి డిమాండ్‌ పెరగడం ప్రభావం చూపినట్లు తెలియజేశారు. అయితే పండుగల సీజన్‌ కారణంగా అక్టోబర్‌లో ఫిజికల్‌ గోల్డ్‌ కొనుగోలుకి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారని, దీంతో పెట్టుబడులు సైతం లభించాయని వివరించారు. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో నికరంగా రూ. 1,121 కోట్ల పెట్టుబడులు లభించినట్లు గణాంకాలు వెల్లడించాయి. నవంబర్‌ చివరికల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 20,833 కోట్లను తాకాయి. ఫోలియోల సంఖ్య 11,800 పెరిగి 46.8 లక్షలకు చేరింది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ యూనిట్‌లు డీమ్యాట్‌ రూపంలో పసిడిలో పెట్టుబడులకు వీలు కల్పించే సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు