టెలికం పరిధిలోకి ఓటీటీ సంస్థలు

23 Sep, 2022 04:59 IST|Sakshi

ఇంటర్నెట్‌ కాలింగ్, మెసేజింగ్‌ సేవలకూ లైసెన్సు

ముసాయిదా టెలికం బిల్లు–2022లో ప్రతిపాదనలు

వాట్సాప్, జూమ్‌ తదితర సంస్థలపై ప్రభావం

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ కాలింగ్, మెసేజింగ్‌ వంటి సర్వీసులు అందించే ఓవర్‌–ది–టాప్‌ (ఓటీటీ) సంస్థలను కూడా టెలికం లైసెన్సుల పరిధిలోకి తీసుకువచ్చేలా టెలికమ్యూనికేషన్‌ బిల్లు 2022 ముసాయిదాను కేంద్రం ఆవిష్కరించింది. దీంతో వాట్సాప్, జూమ్, గూగుల్‌ డ్యువో వంటి ఓటీటీ సంస్థలు ఇకపై దేశీయంగా కార్యకలాపాలు సాగించాలంటే లైసెన్సులు తీసుకోవాల్సి రానుంది. ముసాయిదా ప్రకారం, ఒకవేళ టెలికం లేదా ఇంటర్నెట్‌ ప్రొవైడింగ్‌ సంస్థలు తమ లైసెన్సులను వాపసు చేస్తే అవి కట్టిన ఫీజులను టెలికం శాఖ రిఫండ్‌ చేస్తుంది.

సందర్భాన్ని బట్టి .. టెలికం నిబంధనల కింద నమోదు చేసుకున్న సంస్థ లేదా లైసెన్సుదారుకు సంబంధించి ఎంట్రీ ఫీజులు, లైసెన్సు ఫీజులు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు లేదా ఇతరత్రా ఏవైనా ఫీజులు లేదా చార్జీలు, వడ్డీలు, అదనపు చార్జీలు, పెనాల్టీ మొదలైన వాటిని కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగానైనా రద్దు చేయవచ్చు. ‘ముసాయిదా టెలికం బిల్లు 2022పై అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం‘ అంటూ టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు అక్టోబర్‌ 20 ఆఖరు తేదీ.  

పరిశ్రమలో నవకల్పనలకు మార్గదర్శ ప్రణాళిక: అశ్విని వైష్ణవ్‌
టెలికం పరిశ్రమ పునర్‌వ్యవస్థీకరణకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు కొత్త టెలికం బిల్లు స్పష్టమైన మార్గదర్శ ప్రణాళిక కాగలదని మంత్రి వైష్ణవ్‌ చెప్పారు. వచ్చే ఏడాదిన్నర–రెండేళ్లలో డిజిటల్‌ నియంత్రణ వ్యవస్థను సమూలంగా మార్చే ప్రక్రియ పూర్తి కాగలదని పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. సామాజిక లక్ష్యాలు, వ్యక్తుల బాధ్యతలు.. హక్కుల మధ్య సమతౌల్యం పాటించడం, ఎలాంటి టెక్నాలజీలకైనా వర్తించే విధానాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు