ఎలక్ట్రిక్ వాహనదారులకు ఐఓసీఎల్ గుడ్‌న్యూస్‌!

3 Nov, 2021 17:17 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరల వల్ల కొత్త వాహనం కొనలనుకునేవారు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఒక విషయం మాత్రం వారిని వెనుకడుగు వేసేలా చేస్తుంది. అదే ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ సమస్య. దేశంలో పెట్రోల్, డీజిల్ ఉన్న సంఖ్యలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఈవీ కొనుగోలుదారులు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఈవీ కొనుగోలుదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక శుభవార్త తెలిపింది.

రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీల) కోసం 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేట్(ఐఓసీఎల్) లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాదిలోగా 2,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను, ఆ తర్వాత రాబోయే రెండేళ్లలో మరో 8,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఐఓసీఎల్ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఏర్పడటంతో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. దీంతో అనేక ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఈవీ తయారీదారుల సహకారంతో దేశంలో ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. గత వారం, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్-సెక్టార్ ఇంటిగ్రేటెడ్ కంపెనీల్లో ఒకటైన టాటా పవర్ దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

(చదవండి: వన్‌ప్లస్‌ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్, స్పీడ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!)

మరిన్ని వార్తలు