ఎంజీ ఎస్టర్‌ ఎస్‌యూవీ.... కీ ఫీచర్లు ఇవే

18 Aug, 2021 15:59 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ టెక్నాలజీ బాట పట్టింది. ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు కొనసాగుతుండటంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సాంకేతిక హంగులు జోడిస్తున్నాయి. ఈ విషయంలో మిగిలిన కంపెనీల కంటే ఎంజీ మోటార్స్‌ ఒక అడుగు ముందే ఉంది. ఇప్పటికే రిలయన్స్‌ జియోతో జట్టు కట్టి  నెట్‌ కనెక్టివిటీ అందిస్తుండగా ఇప్పుడు ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ మీద దృష్టి సారించింది. 

ధర తక్కువ 
హెక్టార్‌ ఎస్‌యూవీతో ఇండియన్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంజీ మోటార్‌, ఈసారి ఇండియన్‌ మార్కెట్‌కు తగ్గట్టుగా  ఎస్టర్‌ పేరుతో ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీసి మార్కెట్‌లోకి తెస్తోంది. ఎంజీ మోటార్స్‌ నుంచి తక్కువ ధరకు లభించే వాహనంగా ఇది ఇప్పటికే పేరు తెచ్చుకుంది. ఎస్టర్‌ ధర విషయంలోనే తక్కువని, ఫీచర్ల విషయంలో కాదంటోంది ఎంజీ మోటార్స్‌.

సీఏఏపీ
ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో డ్రైవర్‌ అసిస్టెంట్‌ అర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ వ్యవస్థ కలిగిన తొలి మోడల్‌గా ఎస్టర్‌ నిలవనుంది. ఇందులో ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ లెవల్‌ టూ టెక్నాలజీని ఉపయోగించారు. కాన్సెప్ట్‌ ఆఫ్‌ కార్‌ యాజ్‌ ఏ ప్లాట్‌ఫార్మ్‌ (సీఏఏపీ) సాఫ్ట్‌వేర్‌ని ఇందులో అందిస్తున్నారు.

ఏఐ ఫీచర్లు
డ్రైవర్‌ అసిస్టెంట్‌లో అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌, ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్‌, ఆటోమేటిక్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, లైన్‌ కీప్‌ అసిస్టెంట్‌, లైన్‌ డిపాచర్‌ వార్నింగ్‌, లైట్‌ డిపాచర్‌ ప్రివెన్షన్‌, స్పీడ్‌ అసిస్ట్‌ సిస్టమ్‌ (మాన్యువల​, ఇంటిలిజెంట్‌మోడ్‌), రియర్‌ డ్రైవ్‌ అసిస్టెంట్‌, ఇంటిలిజెంట్‌ హెడ్‌ ల్యాంప్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

వాటికి పోటీగా
ఈ కారు ధర ఎంత అనేది ఇంకా ఎంజీ మోటార్స్‌ వెల్లడించలేదు. అయితే హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌ ధరల శ్రేణిలోనే ఎస్టర్‌ ధరలు ఉండవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా.
 

మరిన్ని వార్తలు