స్క్రాపేజీ విధానంతో వాహనాల ధరలు తగ్గనున్నాయా...!

18 Aug, 2021 09:56 IST|Sakshi

నిపుణుల అంచనా

న్యూఢిల్లీ: వాహనాల స్క్రాపేజీ విధానంతో కొత్త వ్యాపార మోడల్స్‌ రాగలవని  పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. చిన్న, మధ్య తరహా సంస్థలు.. వాహనాల టెస్టింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి అవకాశాలు లభించగలవని పేర్కొన్నారు. నమోదిత వెహికల్‌ స్క్రాపింగ్‌ కేంద్రాల (ఆర్‌వీఎస్‌ఎఫ్‌) ఏర్పాటు కోసం పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ ఇండియా పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు సుమారు 50–60 దాకా రావచ్చని తెలిపింది. ఆటోమోటివ్‌ల తయారీ సంస్థలు.. రీసైక్లింగ్‌ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు తేగలవని ఈవై ఇండియా పేర్కొంది. రీసైకిల్‌ చేసిన ఉత్పత్తుల కారణంగా ముడి వస్తువుల ధరలు, తత్ఫలితంగా వాహనాల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వివరించింది. కోవిడ్‌–19 పరిస్థితులు.. ప్రస్తుత సరఫరా వ్యవస్థలోని బలహీనతలను గురించి పరిశ్రమకు తెలియజెప్పాయని ఈవై ఇండియా తెలిపింది.  

స్క్రాపేజీ విధానం వల్ల కాలుష్యం, ఇంధన దిగుమతుల బిల్లుల భారం వంటివి తగ్గడం.. విడిభాగాల పునర్వినియోగంవంటి సానుకూల పరిణామాలు ఉండగలవని వివరించింది. వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులు, సర్వీసులు అందించే దిశగా సంప్రదాయ ఆటోమోటివ్‌ వ్యవస్థలో భాగమైన సంస్థలు, కొత్త సంస్థలు సంఘటితంగా కలిసి పనిచేయడానికి ఆస్కారం ఉందని తెలిపింది.  

మరిన్ని వార్తలు