రుణ నాణ్యత, ఉద్యోగుల భద్రతకే ప్రాధాన్యం

8 Oct, 2020 04:11 IST|Sakshi

కస్టమర్ల ప్రయోజనాలకూ పెద్దపీట

ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌ దినేష్‌ ఖారా

ముంబై: రుణ నాణ్యత, ఉద్యోగుల భద్రత, కస్టమర్ల ప్రయోజనాలే బ్యాంక్‌ తొలి ప్రాధాన్యతలని బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త చైర్మన్‌  దినేష్‌ కుమార్‌ ఖారా పేర్కొన్నారు. ఎస్‌బీఐ సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన దినేష్‌ కుమార్‌ మూడేళ్ల కాలానికి చైర్మన్‌గా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అనంతరం బుధవారం చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

► కోవిడ్‌–19 నేపథ్యంలో పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అయితే ఆర్‌బీఐ నిర్దేశిస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కంపెనీలకు తగిన మద్దతు అందించడానికి బ్యాంక్‌ ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది.  
► రుణ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి పలు  ప్రతిపాదనలు అందాయి. అయితే ఇక్కడ రుణ పునర్‌వ్యవస్థీకరణను కోరుతున్న కస్టమర్ల సంఖ్యను చూస్తే, బ్యాంక్‌ నిర్వహించదగిన స్థాయిలోనే ఈ పరిమాణం ఉంది.  
► మూలధనం విషయంలో బ్యాంక్‌ పరిస్థితి పటిష్టంగా కొనసాగుతోంది.  
► ఎస్‌బీఐ డిజిటల్‌ సేవల వేదిక అయిన ‘యోనో’ను ప్రత్యేక సబ్సిడరీ (పూర్తి అనుబంధ సంస్థ)గా వేరు చేయాలన్న అంశంపై పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. తగిన సమయంలో ఆయా అంశలను వెల్లడిస్తాం.

మరిన్ని వార్తలు