మణిపాల్‌ చేతికి ఆమ్రి హాస్పిటల్స్‌

21 Sep, 2023 05:37 IST|Sakshi

84 శాతం వాటా కొనుగోలు

డీల్‌ విలువ రూ. 2,300 కోట్లు

కోల్‌కతా/న్యూఢిల్లీ: హెల్త్‌కేర్‌ సంస్థ మణిపాల్‌ హాస్పిటల్స్‌ తాజాగా ఇమామీ గ్రూప్‌ సంస్థ ఆమ్రి హాస్పిటల్స్‌లో 84% వాటాను సొంతం చేసుకుంది. సింగపూర్‌ కంపెనీ టెమాసెక్‌ హోల్డింగ్స్‌కు 59% వాటాగల మణిపాల్‌ ఇందుకు రుణాలుసహా రూ. 2,300 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆమ్రి హాస్పిటల్స్‌లో 15% వాటాతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఇమామీ గ్రూప్‌ ఇన్వెస్టర్‌గా కొనసాగనుంది. తాజా కొనుగోలుతో మణిపాల్‌ హాస్పిటల్స్‌ దేశ తూర్పు ప్రాంతంలో కార్యకలా పాలు విస్తరించనుంది.

సంయుక్త సంస్థ దేశవ్యాప్తంగా 17 పట్టణాలు, నగరాలలో 9,500 పడకలతో 33 ఆసుపత్రులను నిర్వహించనుంది. వెరసి దేశీయంగా రెండో పెద్ద హెల్త్‌కేర్‌ సేవల సంస్థగా ఆవి ర్భవించనుంది. సంబంధిత వర్గాల సమా చారం ప్రకారం ఆమ్రి రుణ భారం రూ.1,600 కోట్లు కాగా.. రూ.2,400 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువలో డీల్‌ జరిగినట్లు తెలుస్తోంది. క్లినికల్‌ నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలుగల ఆమ్రి హాస్పిటల్స్‌ను జత కలుపుకోవడం ద్వారా భారీ నెట్‌వర్క్‌కు తెరలేవనున్నట్లు మణిపాల్‌ పేర్కొంది.

తద్వారా దేశ తూర్పుప్రాంతంలో అత్యంత నాణ్యమైన ఆరోగ్యపరిరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన సేవలు అందించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. అయితే మణిపాల్‌ 2021లో కోల్‌కతాలోని కొలంబియా ఏషియా హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా తూర్పు భారతంలో కార్యకలాపాలు ప్రారంభించింది. కాగా.. హెల్త్‌కేర్‌ రంగ మరో దిగ్గజం అపోలో హాస్పిటల్స్‌ 10,000 పడకల సామర్థ్యంతో 64 ఆసుపత్రులను నిర్వహిస్తోంది.
 

మరిన్ని వార్తలు