మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు

18 Sep, 2023 06:51 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ మాజీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌

ముంబై: మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ మాజీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అన్నారు. మ్యూచువల్‌ ఫండ్‌–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్‌ ఫండ్స్‌ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫండ్స్‌ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి.

ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్‌–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్‌లు, 11 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్‌ వివరించారు. మ్యూచువల్‌ ఫండ్‌ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్‌.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్‌ హోల్డర్లు, ఫండ్స్‌ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు