పాలసీ రేట్లు యథాతథం?

29 Mar, 2021 00:13 IST|Sakshi

ఏప్రిల్‌ 7న ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష

కీలక వడ్డీరేట్లలో మార్పు ఉండకపోవచ్చని విశ్లేషకుల అంచనా  

న్యూఢిల్లీ: కరోనావైరస్‌ కేసులు భారీగా పెరుగుతుండటంతో మళ్లీ అనిశ్చితి నెలకొంటున్న పరిస్థితుల మధ్య రిజర్వ్‌ బ్యాంక్‌ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్‌లో తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. మూడు రోజుల పాటు జరిగే సమాలోచనల తర్వాత ఏప్రిల్‌ 7న పాలసీ రేట్లను ప్రకటించనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఆర్‌బీఐ కమిటీ చివరిసారిగా సమావేశమైంది.

ద్రవ్యోల్బణంపరమైన ఆందోళనల కారణంగా అప్పుడు కూడా రెపో రేటును (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) యథాతథంగానే ఉంచింది. ఇప్పుడు కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఉదార పరపతి విధానాన్నే కొనసాగించవచ్చని, ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంలో విఫలం కాకుండా వృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకునేందుకు తగు సమయం వచ్చే దాకా వేచి చూసే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ కేసుల పెరుగుదల, పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు విధిస్తుండటం తదితర అంశాలు అనిశ్చితికి దారి తీయొచ్చని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ ఒక నివేదికలో పేర్కొంది. రెపో రేటు ప్రస్తుతం 4%గా ఉండగా, రివర్స్‌ రెపో రేటు 3.35%గా ఉంది. గతేడాది మే నుంచి ఆర్‌బీఐ పాలసీ రేట్ల విషయంలో యథాతథ స్థితి కొనసాగిస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు