భారత్‌ జీడీపీ వృద్ధి 7 శాతం!

31 Mar, 2021 05:19 IST|Sakshi

2021–22లో జోరందుకుంటుంది...

భారత్‌ ఎకానమీపై ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2021–22లో 7 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి అంచనా వేసింది. ఆసియా, పసిఫిక్‌ ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్యసమితి కమిషన్‌ (యూఎన్‌ఈఎస్‌సీఏపీ) మంగళవారం విడుదల చేసిన తన సర్వే ఆధారిత నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... 

 1. మహమ్మారి భారత్‌ వ్యాపార క్రియాశీలతను తీవ్రంగా దెబ్బతీసింది. దీనితో 2020–21లో ఆర్థిక వ్యవస్థ 7.7% క్షీణిస్తుంది. బేస్‌ ఎఫెక్ట్‌సహా ఆర్థిక క్రియాశీలత మళ్లీ ప్రారంభం కావడంతో 2021–22లో వృద్ధి రేటు 7%గా ఉండే వీలుంది.   

2. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్‌ 14, ఏప్రిల్‌ 15–మే 3, మే 4–మే 17, మే 18–మే 31) కఠిన లాక్‌డౌన్‌ అమలు ఆర్థిక సంవత్సరం మొదటి, రెండు త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు తొ లగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊ పందుకోవడంతో మూడో త్రైమాసికంలో స్వల్ప వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలోనూ దాదాపు ఇదే స్థాయి వృద్ధి రేటు నమోదుకావచ్చు.  

3. కేంద్ర రుణ సమీకరణలకు సంబంధించి వడ్డీ వ్యయాలను తక్కువ స్థాయిలో ఉంచడం, బ్యాంకింగ్‌ మొండిబకాయిల తీవ్రతను అందుపులో ఉంచడం దేశం ముందు ఉన్న ప్రస్తుత పెద్ద సవాళ్లు.  

4. వర్ధమాన ఆసియా–పసిఫిక్‌ దేశాల సగటు వృద్ధిరేటు 2021లో 5.9 శాతం ఉండే వీలుంది. 2022లో ఇది 5 శాతానికి తగ్గవచ్చు. 2020లో ఆయా దేశాల ఉత్పత్తి రేటు 1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.  

5. బేస్‌ ఎఫెక్ట్‌ వల్ల 2021లో భారీ వృద్ధి రేటు (వీ నమూనా) కనిపించినప్పటికీ, తిరిగి ఎకానమీ ‘కే’ నమూనా రికవరీగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. పలు పరిశ్రమలు, వ్యక్తులకు సంబంధించి రికవరీ రేటు విస్తృత ప్రాతిపదికన, ఏకరీతిన కాకుండా విభిన్నంగా ఉండే అవకాశం ఉంది.
 
6. ఆసియా, పసిఫిక్‌ దేశాలు కేవలం వృద్ధిమీదే దృష్టి పెడుతున్నాయి తప్ప, ఉపాధి కల్పన, సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డానికి చర్యలు వంటి అంశాలపై శ్రద్ధ పెట్టడం లేదు. మహమ్మారి వల్ల ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో దాదాపు 8.9 కోట్ల మంది తీవ్ర పేదరికంలో పడిపోయారు. వారు రోజుకు కేవలం 1.90 డాలర్లు (రూ.145కన్నా తక్కువ) సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయారు.  

7. వృద్ధి ప్రణాళికల్లో ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు వంటి అంశాలకూ ప్రాధాన్యత ఇవ్వాలి. వర్ధమాన దేశాల్లో సైతం దిగువన ఉన్న ఎకానమీలకు అంతర్జాతీయ సహకారం అందాలి. కోవిడ్‌ను ఎదుర్కొనడంలో చైనా పటిష్ట చర్యలు తీసుకుంది. ఈ కారణంగానే 2020 నాల్గవ త్రైమాసికంలో 6.5% వృద్ధిని సాధించగలిగింది. చైనా రిక వరీ మున్ముందూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు