అమెరికాకు మామిడి ఎగుమతులు

24 Nov, 2021 07:52 IST|Sakshi

చెర్రీల దిగుమతులపై కసరత్తు 

భారత్‌–అమెరికా మధ్య ‘టీపీఎఫ్‌’ సమావేశంలో నిర్ణయం 

న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఎగుమతి, దిగుమతుల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులను చేర్చడంపై భారత్, అమెరికా దృష్టి సారించాయి. ఈ ప్రయత్నాలు ఫలవంతమైతే భారత్‌ నుంచి అమెరికాకు మామిడి, దానిమ్మ  ఎగుమతి చేయడానికి, అక్కడి నుంచి చెర్రీ పళ్లను దిగుమతి చేసుకోవడానికి వీలు కానుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని మంగళవారం జరిగిన భేటీలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్, అమెరికా ట్రేడ్‌ రిప్రెజెంటేటివ్‌ (యూఎస్టీఆర్‌) కేథరిన్‌ టై అంగీకరించారు. అలాగే ఇతరత్రా వాణిజ్యాంశాలను కూడా వారు చర్చించారు. నాలుగేళ్లలో తొలిసారిగా జరిగిన భారత్‌–అమెరికా ట్రేడ్‌ పాలసీ ఫోరం (టీపీఎఫ్‌) 12వ మంత్రుల స్థాయి సమావేశానికి వారు సహ–సారథ్యం వహించారు. మామిడి, దానిమ్మ పళ్ల ఎగుమతులకు తోడ్పడేందుకు అవసరమైన చర్యలను అమెరికా తీసుకోనున్నట్లు, అలాగే అక్కడి నుంచి చెర్రీలు, పశువుల ఆహారం ఆల్ఫాఆల్ఫా ఎండుగడ్డిని దిగుమతి చేసుకునేందుకు కావాల్సిన సర్టిఫికేషన్‌ ప్రక్రియను భారత్‌ ఖరారు చేయనున్నట్లు ఇరు వర్గాలు  సంయుక్త ప్రకటనలో తెలిపాయి. 2007 నుంచి అమెరికాకు భారత మామిడి ఎగుమతులు పుంజుకోగా.. కరోనాతో  రెండేళ్లుగా నిల్చిపోయాయి.  

ఈసారి 100 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం.. 
ఈ ఏడాది రెండు దేశాల మధ్య వర్తక వాణిజ్యం 100 బిలియన్‌ డాలర్లకు చేరగలదని గోయల్, కేథరిన్‌ అభిప్రాయపడ్డారు. వాణిజ్యపరంగా అడ్డంకులను తొలగించేందుకు మరిన్ని అంశాలపై కలిసి పనిచేయాలని తీర్మానించారు. అటు, దేశీ ఎగుమతిదారులకు ప్రాధాన్య హోదా (జీఎస్‌పీ) ప్రయోజనాలను పునరుద్ధరించాలని సమావేశం సందర్భంగా అమెరికాను భారత్‌ కోరింది. దీన్ని పరిశీలిస్తామంటూ అమెరికా హామీ ఇచ్చింది. అలాగే వివిధ ఉత్పత్తులపై టారిఫ్‌ల తగ్గింపు అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి.
 

మరిన్ని వార్తలు