కూరగాయల ధరలు 37% అప్‌!

15 Oct, 2020 05:56 IST|Sakshi

సెప్టెంబర్‌ టోకు ధరల స్పీడ్‌ ఇది.. మొత్తంగా 1.32% పెరిగిన సూచీ

ఏడు నెలల గరిష్ట స్థాయి  

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 1.32 శాతంగా నమోదయ్యింది. ఏడు నెలల గరిష్టస్థాయి ఇది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాకాల ప్రకారం– సూచీలో దాదాపు 14 శాతం వెయిటేజ్‌ ఉన్న ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ ధర భారీగా పెరిగింది. కూరగాయల ధరలు 37 శాతం పెరిగితే (2019 సెప్టెంబర్‌ ధరలతో పోల్చి), ఆలూ విషయంలో ద్రవ్యోల్బణం ఏకంగా 108 శాతంగా ఉంది.   

సూచీలోని 3 ప్రధాన విభాగాలూ ఇలా...
► మొత్తం సూచీలో 20.12%గా ఉన్న ప్రైమరీ ఆర్టికల్స్‌ (ఫుడ్‌ అండ్‌ నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌సహా)లో ద్రవ్యోల్బణం 5.10 శాతంగా నమోదయ్యింది. ఇందులో 14.34 శాతం వెయిటేజ్‌ ఉన్న ఫుడ్‌ ఆర్టికల్స్‌లో ధరాభారం 8.17 శాతంగా ఉంది. అయితే 4.26 శాతం వెయిటేజ్‌ ఉన్న నాన్‌ ఫుడ్‌ బాస్కెట్‌ ధర మాత్రం 0.08 శాతం తగ్గింది.  
► ఇక 14.91 శాతం వెయిటేజ్‌ ఉన్న ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌ విభాగంలో ద్రవ్యోల్బణం కూడా 9.54 శాతం తగ్గింది.
► 64.97 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ ఉత్పత్తుల్లో ధరలు  1.61 శాతం పెరిగాయి.  

కూరగాయల ధరలు చూస్తే...
ఫుడ్‌ ఆర్టికల్స్‌లో ధరాభారం ఎనిమిది నెలల గరిష్ట స్థాయిలో 8.17 శాతం పెరిగితే, కూరగాయలు, ఆలూ ధరలు సామాన్యునికి భారంగా మారిన పరిస్థితి నెలకొంది. పప్పుదినుసుల ధరలు 12.53 శాతం ఎగశాయి. కాగా, ఉల్లిపాయలు (31.64%), పండ్లు (3.89%), తృణ ధాన్యాల (3.91%) ధరలు తగ్గాయి.  రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.34%గా నమోదయ్యింది. గత 8 నెలల్లో ఇంత అధిక స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు