టాలెంట్‌ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ 

12 Jan, 2023 05:00 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ నాల్గవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ తన ఉద్యోగులకు  బంపర్‌ ఆఫర్‌  అందించింది. కంపెనీలోని ఉన్నతోద్యోగులకు రికార్డు స్థాయిలో ప్రమోషన్లను ప్రారంభించింది. సీనియర్ల ప్రతిభను, అనుభవాన్ని నిలుపుకునే క్రమంలో ఈచర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీలో 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను పై స్థాయిలకు ప్రమోట్‌ చేసింది. ఇంత పెద్ద స్థాయిలో ప్రమోషన్లు ఇంతకుముందెపుడూ ఇవ్వలేదని కంపెనీ తెలిపింది. ఇటీవలి కాలంలో కీలక ఉన్నతస్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్న సమయంలో ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. 

ప్రతిభావంతులైన ​లీడర్‌షిప్‌ ఉద్యోగుల పైప్‌లైన్‌ను బలోపేతం చేయడానికి రికార్డు స్థాయిలో సీనియర్ ప్రమోషన్‌లను ప్రారంభించింది విప్రో. కంపెనీ 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్‌విపి) పదవికి ఎలివేట్ చేయగా, 61 మంది ఎగ్జిక్యూటివ్‌లను వైస్ ప్రెసిడెంట్ (వీపీ)గా  ప్రమోట్‌ చేసింది. ఫలితంగా  విప్రోలో  ఇప్పుడు దాదాపు 200 మంది వీపీలు,  32 ఎస్‌వీపీలు సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి పనిచేస్తున్నారు. మరోవైపు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 23.3శాతం అట్రిషన్‌ను నమోదు చేసిన కంపెనీ అక్టోబర్-డిసెంబర్ ఫలితాలను ఈ శుక్రవారం ప్రకటించనుంది.

కాగా గత ఏడాది, నాలుగు దేశాల్లో వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్న కనీసంనలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు విప్రో నుంచి నిష్క్రమించారు. బ్రెజిల్‌లో వ్యాపారాన్ని పర్యవేక్షించిన డగ్లస్ సిల్వా, జపాన్‌ హెడ్‌, టోమోకి టేకుచి,ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సారా ఆడమ్-గెడ్జ్;  మిడిల్ ఈస్ట్ రీజియన్  బిజినెస్‌ హెడ్‌ మొహమ్మద్ అరేఫ్ సంస్థను వీడిని సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు