విద్యార్థుల ఇన్‌స్పైర్‌

19 Mar, 2023 02:20 IST|Sakshi

ఉమ్మడి ‘తూర్పు’ నుంచి రాష్ట్ర స్థాయికి 20 ప్రాజెక్టుల ఎంపిక

23, 24 తేదీల్లో కాకినాడలో ఎస్‌ఎల్‌ఈపీసీ

ప్రాజెక్టులకు మెరుగులు దిద్దుకునేందుకు 21 వరకూ అవకాశం

రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యార్థులు వినూత్న ఆలోచనలతో సైన్స్‌ ప్రయోగాల్లో దూసుకుపోతున్నారు. మెదళ్లకు పదును పెడుతూ నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ఇన్‌స్సైర్‌ మనక్‌ పురస్కారాలతో విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. 2021–22 విద్యా సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్‌ మనక్‌కు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 5,400 నామినేషన్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీటిలో జిల్లా స్థాయికి 232 ఎంపికయ్యాయి. మళ్లీ వీటిలో రాష్ట్ర స్థాయికి 20 నామినేషన్లు ఎంపికయ్యాయి. దీనిపై సైన్స్‌ ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

232 ప్రాజెక్టులకు ప్రోత్సాహకం

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫెడరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్‌ మనక్‌ 2021–22 పోటీలు నిర్వహించారు. గత ఏడాది 14 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా, ఈ ఏడాది 20 ప్రాజెక్టులు ఎంపికవడం గమనార్హం. జిల్లా స్థాయికి ఎంపికై న 232 ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం కూడా అందజేశారు. సైన్స్‌, సాంకేతిక రంగాలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా కేంద్ర ప్రభుత్వం పోటీలు నిర్వహిస్తోంది. వీటిలో 6 నుంచి 10 తరగతి విద్యార్థులను భాగస్వాములను చేశారు. ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి ఐదు చొప్పున నామినేషన్లు పంపించారు. పర్యావరణ పరిరక్షణ, అధునాతన వ్యవసాయ విధానాలు, హెల్త్‌ న్యూట్రిషన్‌ వంటి అంశాలపై నూతన ఆవిష్కరణలు రూపొందించారు. ఈ నెల 23, 24 తేదీల్లో కాకినాడ సమగ్ర శిక్షా సమావేశ హాలులో రాష్ట్ర స్థాయి ప్రదర్శన, ప్రాజెక్టు పోటీలు (ఎస్‌ఎల్‌ఈపీసీ) నిర్వహించనున్నారు. ఈ ఏడాది జాతీయ స్థాయి ప్రాజెక్టుల ఎంపికకు కాకినాడ వేదిక కానుండటం విశేషం.

ఆ నమ్మకం ఉంది

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి 20 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గర్వంగా ఉంది. జాతీయ స్థాయిలో కూడా జిల్లా అగ్రస్థానంలో నిలుస్తుందన్న నమ్మకం ఉంది. అందుకు తగినట్టుగా ప్రాజెక్టులను సిద్ధం చేయాలి.

– కేఎన్‌వీఎస్‌ అన్నపూర్ణ, డీఈఓ, కాకినాడ

గైడ్‌ టీచర్లు పర్యవేక్షించాలి

రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీలకు కాకినాడ వేదికగా నిలవడం ఉమ్మడి జిల్లాకు గర్వకారణం. రాష్ట్రస్థాయి పోటీలు విజయమంతమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లా సైన్స్‌ అధికారులు ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకూ తావు లేకుండా చర్యలు చేపట్టాలి. రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రతి ప్రాజెక్టూ జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా రూపకల్పన చేసేందుకు గైడ్‌ టీచర్లు తగిన పర్యవేక్షణ చేయాలి.

– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ

విద్యార్థుల స్పందన అమోఘం

నూతన ఆవిష్కరణల్లో జిల్లా విద్యార్థులు అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ప్రాజెక్టుల రూపకల్పనలో వారి స్పందన అమోఘం. గత ఏడాది రాష్ట్ర స్థాయికి ఎంపికై న 14 ప్రాజెక్టుల్లో మూడు జాతీయ స్థాయికి ఎంపిక కావడం, వాటిలో ఒకటి విజేతగా నిలవడం గర్వంగా ఉంది. మరో ప్రాజెక్టు రూరల్‌ ఇన్నోవేషన్‌ విభాగంలో విజేతగా నిలిచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతిభను జాతీయ స్థాయికి తెలియజేసింది.

– మైలపల్లి శ్రీనివాస వినీల్‌,

ఉమ్మడి జిల్లా సైన్స్‌ అధికారి, కాకినాడ

ఈ ఏడాదీ ఆన్‌లైన్‌లోనే..

ఇన్‌స్పైర్‌ మనక్‌ 2021–22కు సంబంధించిన జిల్లా స్థాయి పోటీలను గత ఏడాది మాదిరిగానే ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 8 శాతం ప్రాజెక్టులను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. న్యాయ నిర్ణేతలు ఆన్‌లైన్‌లోనే ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. గత ఏడాది మూడు ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికవగా, ఈ ఏడాది కూడా జాతీయ స్థాయికి అధికంగా ప్రాజెక్టులు ఎంపికవుతాయని విద్యాశాఖ అధికారులు, ఉమ్మడి జిల్లా సైన్స్‌ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న ప్రాజెక్టులపై ఆయా పాఠశాలలకు సమాచారం అందించారు. ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర స్థాయి ప్రదర్శన జరగనున్నందున 21 వరకూ ఇప్పటికే రాష్ట్ర స్థాయికి ఎంపికై న 20 ప్రాజెక్టులనూ మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశముంది. ఆ దిశగా సంబంధిత విద్యార్థులకు, గైడ్‌ టీచర్లకు జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు