జూపార్క్‌పై కోవిడ్‌ దెబ్బ: 20 మంది ఉద్యోగులపై వేటు

8 May, 2021 11:00 IST|Sakshi

సాక్షి, బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్‌ పార్కులో  బ్యాటరీ వాహన డ్రైవర్లుగా పని చేస్తున్న 20 మంది ఉద్యోగులను జూ అధికారులు విధుల నుంచి తొలగించారు. జూలో కాలుష్య రహిత బ్యాటరీ వాహనాలు ప్రారంభమైనప్పటి నుంచి సందర్శకులను బ్యాటరీ వాహనాల్లో తిప్పుతూ వన్యప్రాణుల వివరాలను డ్రైవర్లు తెలిపే వీరిని కరోనా కారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారు. జూ పున:ప్రారంభమైనప్పుడు చూస్తామని... ప్రస్తుతం విధుల్లోకి రావద్దని  అధికారులు పేర్కొన్నారు.

తమను విధుల్లో నుంచి తొలగిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు నెలల వేతనం చెల్లించాలని, కానీ జూ అధికారులు ఎలాంటి వేతనాలు చెల్లించకుండా తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీసం నెల ఖర్చులు కూడా ఇవ్వకుండా తొలగించారన్నారు. గతంలో జూపార్కు క్యూరేటర్‌ శివానీ డోగ్రా పెద్ద ఎత్తున 200 మంది ఉద్యోగులను అర్ధాంతరంగా విధుల్లో నుంచి తొలగించారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఉద్యోగులను తొలగిస్తూ వారి బతుకులను అంధకారమయం చేస్తున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం, అటవీ శాఖ మంత్రి స్పందించి  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆదుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
(చదవండి: భర్త ఇంటికి వచ్చేసరికి భార్యతో సహా పిల్లలు..)

మరిన్ని వార్తలు