Hijarbie Success Story: బార్బీ కాస్త హిజార్బీ! నాలా లేదన్న ఆలోచనే.. ఈ సరికొత్త బార్బీ!

5 Aug, 2023 12:35 IST|Sakshi

బార్బీ బొమ్మలను ఇష్టపడని వారు ఉండరేమో. బార్బీ అంత అందంగా ఉండాలని అమ్మాయిలంతా అనుకుంటారు. కానీ నాలాగా బార్బీలేదే? నాలాంటి డ్రెస్‌ వేసుకోలేదే అని అనుకున్న ఓ ఆర్టిస్ట్‌ ఏకంగా సరికొత్త బార్బీని రూపొందించింది. సంప్రదాయం ఉట్టిపడేలా తయారైన ఈ సరికొత్త బార్బీ అందర్నీ తెగ ఆకర్షిచేస్తోంది. రంగు రంగుల డ్రెస్‌లు, ప్రముఖుల రూపాలతో అందర్నీ ఆకర్షించే బార్బీ హిజాబ్‌ వేస్తే ఎలా ఉంటుంది అనుకుంది నైజీరియాకు చెందిన 32 ఏళ్ల హనీఫా ఆడమ్‌.

మార్కెట్లో హిజాబ్‌ ధరించిన బొమ్మల కోసం వెతికింది. ఎంత గాలించినా హిజాబ్‌ ధరించిన ఒక్క బొమ్మ కూడా కనిపించలేదు. తనలా హిజాబ్‌ ధరించిన బార్బీ కనిపించలేదని బాధపడింది. దీంతో తనే... హిజాబ్‌ ధరించిన బార్బీని తయారు చేయాలని నిర్ణయించుకుంది. 2015 డిసెంబర్‌లో ..నేవీ మ్యాక్సి స్కర్ట్‌ కుట్టి, నీలం రంగు జాకెట్, నలుపు రంగు హిజాబ్‌ను బార్బీకి తొడిగి ఫోటో తీసింది. ‘హిజార్బీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ తెరిచి...చక్కగా చూడముచ్చటగా ఉన్న తొలి హిజార్బీ ఫోటోను పోస్టు చేసింది.

ఈ ఫోటో చూసిన వారంతా..‘‘ చాలా బావుంది. మా పిల్లలకు కూడా ఇటువంటి డ్రెస్సే కావాలని’’ అడిగారు. దీంతో హనీఫా మరింత ఉత్సాహంతో వివిధ రకాల హిజార్బీలను రూపొందించింది. డ్రస్‌లన్నింటిలోకి లైఫ్‌స్టైల్, ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ హబీబీ డిసిల్వా ధరించిన బ్రిటిష్‌ స్టైల్‌ డ్రెస్‌ బాగా పాపులర్‌ అయ్యింది. మీడియా భారీ కవరేజ్‌తోపాటు, టీన్‌వోగ్‌ కూడా గుర్తించడంతో హిజార్బీకి మంచి ఆదరణ లభించింది. ఇప్పటిదాక హిజార్బీ అకౌంట్‌లో రెండు వందలకు పైగా ఫోటోలు పోస్టు చేసింది. ముస్లిం సాంప్రదాయం, ఫ్యాషన్‌ను ప్రతిబింబించేలా హనీఫా హిజార్బీలు తయారు చేయడం విశేషం.

ఇటీవల విడుదలైన బార్బీ సినిమాతో బార్బీ మేనియా చూసి హనీఫా మరోసారి హిజార్బీని యాక్టివ్‌ చేసింది. ఈ క్రమంలోనే ..ఆరేళ్ల తరువాత పింక్‌ రంగు వేసిన గోడ ముందు పింక్‌ కలర్‌ డ్రెస్‌ వేసుకుని, హిజాబ్‌ ధరించి నిలుచున్న హిజార్బీ పోటోను ఇన్‌స్టా అకౌంట్‌లో ‘‘హిజార్బీ ఈజ్‌ బ్యాక్‌’’ అంటూ పోస్టు చేసింది. ఈ పోస్టుకు నెటిజన్లు ఫిదా అయిపోయి తెగ లైక్‌లు కొడుతున్నారు. 

మ్యాటెల్‌ హిజార్బీ..
హనీఫా తయారు చేసిన హిజార్బీ పాపులర్‌ కావడంతో 2017లో బార్బీ తయారీ సంస్థ కూడా హిజాబ్‌ దరించిన బార్బీని విడుదల చేసింది. అమెరికా ఒలింపిక్‌ ఫెన్సర్‌ ఇతిహాజ్‌ మహమ్మద్‌ రూపంతో హిజార్బీని విడుదల చేసింది. 

వ్యాపారిని కాదు.. ఆర్టిస్ట్‌ అవాలనుకోలేదు
‘‘ఫైన్‌ ఆర్ట్స్‌ను చదివాను. కానీ ఆర్టిస్ట్‌ అవ్వాలనుకోలేదు. డాక్టర్‌ అవాలనుకున్నాను. అదీ కుదరక ఫిజియాలజీ చదివాను. ఫార్మకాలజీలో మాస్టర్స్‌ చేసాను. చదువు పూర్తిచేసి యూకే నుంచి నైజీరియా వచ్చాక... నాకు తెలిసిన ఫ్యాషన్‌ ఐడియాలను ఆన్‌లైన్‌లో పోస్టు చేసేదాన్ని. వాటిని చూసిన వారంతా అభినందించేవారు. 2016లో ఫుడ్‌ ఆర్ట్‌ కాంపిటీషన్‌లో పాల్గొని విజేతగా నిలిచాను. అప్పుడు ఆర్టిస్ట్‌గా మారాలనుకున్నాను. అప్పటినుంచి నేను రూపొందించిన కళారూపాలను నైజీరియా, న్యూయార్క్‌ ఎగ్జిబిషన్‌లలో ప్రదర్శించడం మొదలు పెట్టాను.

ఇలా చేస్తూ హిజార్బీని మీ ముందుకు తీసుకొచ్చాను. నేను వ్యాపారిని కాదు. నా స్నేహితురాళ్లు ప్రోత్సహించడంతో వివిధరకాల హిజార్బీని రూపొందించాను. ఈ నెలలో హిజార్బీ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించబోతున్నాను. బట్టల తయారీతోపాటు, నైజీరియా డిష్‌లకు ఫుడ్‌ ఆర్ట్‌ను జోడిస్తూ మా సంప్రదాయాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను రూపొందించే హిజార్బీల్లో.. ఏసియన్, తెలుపు, నలుపు బొమ్మలు ఉన్నాయి. సెలబ్రెటీలను రోల్‌ మోడల్స్‌గా తీసుకునేందుకు వివిధ రంగుల్లో రూపొందిస్తున్నాను’’ అని చెబుతోంది హనీఫా. 

(చదవండి: కరోనాలో దొరికిన ఆ సమయమే..ఆ యువకుడుని కోటీశ్వరుడిగా చేసింది!)
  

మరిన్ని వార్తలు