రైతు పోరాటంపై పంజాబ్‌ ముద్ర

7 Jan, 2021 00:49 IST|Sakshi

విశ్లేషణ

దేశంలో ఏ ప్రాంతంలోని రైతు సంఘాలకంటే పంజాబ్‌ రైతు సంఘాలు, రైతులు కేంద్రప్రభుత్వ నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం కొనసాగిస్తున్నారు. కనీస మద్దతు ధరను డిమాండ్‌ చేయడం కంటే, తమ శ్రమశక్తిని అంగట్లో పెట్టి కొల్లగొట్టాలని చూస్తున్న భారతీయ కార్పొరేట్లను నిలువరించడానికే పంజాబ్‌ రైతులు ఇప్పుడు పోరాడుతున్నారు. న్యాయమైన పోరాటం చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా రైతుల విశేష మద్దతును వారు కూడగట్టగలిగారు. అదే సమయంలో తమ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ముందుకొచ్చే రాజకీయ జిమ్మిక్కుల పట్ల కూడా పంజాబ్‌ రైతులు అప్రమత్తంగా ఉంటూవచ్చారు. ఈ అప్రమత్తత, దృఢనిశ్చయమే తమపై జరుగుతున్న హిందుత్వ దాడిని పంజాబ్‌ రైతులు తిప్పికొట్టగలిగేలా చేసింది.

నూతన వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న రైతుల నిరసన.. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని సాధించుకోవడానికి లేక మూడు కొత్త చట్టాల రద్దు కోసం మాత్రమే కాదు. తగిన విలువను చెల్లించకుండానే రైతుల శ్రమశక్తిని అపహరించుకుపోవాలని చూస్తున్న భారతీయ సంపన్న పెట్టుబడిదారులను నిలువరించడానికే ఇప్పుడు రైతుల పోరాటం జరుగుతోంది. ఈ పోరులో సిక్కు కమ్యూనిటీకి చెందిన రైతులే ఎక్కువగా ముందుపీఠిన నిలబడటానికి అనేక కారణాలు తోడవుతున్నాయి. 

ఎలాంటి చర్చలూ లేకుండా, రైతు సంఘాలను విశ్వాసంలోకి తీసుకోకుండానే.. కేంద్రప్రభుత్వం వివాదాస్పదమైన ఈ మూడు సాగు చట్టాలను పార్లమెంటులో హడావుడిగా ఆమోదింపజేసుకున్నప్పుడే దాంట్లోని ప్రమాదాన్ని పంజాబ్‌ రైతులే మొట్టమొదటగా గ్రహించారు. పంజాబ్‌లోకి సైనిక దళాలను నాటి ప్రధాని ఇందిరాగాంధీ పాలనాయంత్రాంగం పంపించినప్పుడు అంటే 1980ల మొదట్లో పంజాబ్‌ సిక్కులు చివరిసారిగా కేంద్రంతో తలపడ్డారు. అప్పట్లో ఖలిస్తాన్‌ ఉద్యమానికి విస్తృత స్థాయిలో మద్దతు లేదు. కానీ ఇప్పుడు సిక్కు రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా రైతులను సమీకరించడమే కాకుండా, వారి విశేష మద్దతును కూడా కూడగట్టగలిగారు. అందుకే రైతాంగ ఉద్యమంలో ముందుండి పోరాడిన హీరోలుగా వీరు భారతీయ చరిత్రలో స్థానం సంపాదించుకోనున్నారు.

సిక్కు రైతులు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులా?
ఆరెస్సెస్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కలిసి కంగనా రనౌత్‌ వంటి ప్రచారకుల దన్నుతో, పంజాబ్‌ సిక్కు రైతులను ఖలిస్తానీ ఉగ్రవాదులుగా చిత్రించడానికి ప్రయత్నించాయి. కానీ సిక్కు రైతాంగ యువత ఉన్నత విద్యను పొందడమేకాదు.. వారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నందున హిందుత్వ సైన్యానికి సరైన సమాధానం ఇవ్వగలిగారు. ఆరెస్సెస్, బీజేపీలు నియంత్రణలో లేని తమ బలగాలను ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీరీలపై ప్రయోగించినట్లు, పంజాబ్‌ రైతులపై ప్రయోగిస్తే ఒక జాతిగా భారత్‌ ప్రమాదంలో పడుతుంది. పైగా దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోని రైతాంగం కంటే సిక్కు రైతులు మెరుగైన పోరాటం చేయగలరు. అదే సమయంలో తమ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ముందుకొచ్చే రాజకీయ జిమ్మిక్కుల పట్ల కూడా పంజాబ్‌ రైతులు అప్రమత్తంగా ఉంటూ వచ్చారు. ఈ అప్రమత్తత, దృఢనిశ్చ యమే తమపై జరుగుతున్న దాడిని పంజాబ్‌ రైతులు తిప్పికొట్టగలిగేలా చేసింది. పైగా దేశవ్యాప్తంగా రైతులు వారి ఉద్యమంలో భాగమయ్యేలా కూడా చేసింది. 

మరొకవైపు బాలీవుడ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చిత్ర పరిశ్రమ కూడా న్యాయంకోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలబడింది. రైతులు భారతదేశ ఆహార సైనికులు అని చిత్రసీమ ప్రముఖులు వర్ణించారు. ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న రైతు సైనికులు లేనిదే సరిహద్దుల్లో సైనికులు కూడా నిలబడలేరు. ఆరెస్సెస్, బీజేపీలు రైతు సైనికులను జాతీయవాదులుగా ఎన్నడూ గుర్తించలేదు పైగా దేశంలోని బడా వ్యాపార కుటుంబాలను మాత్రమే వారు నిజమైన జాతీయవాదులుగా ఆరాధిస్తున్నారు.

శ్రమను గౌరవించడం
సిక్కు రైతులు ఇలా ఇప్పుడు దుడ్డుకర్రలు ఎందుకు పట్టుకున్నారంటే తమ శ్రమను కాపాడుకోవడం కోసమే. సిక్కు మతంలో శ్రమించడానికి అపారమైన విలువ ఉంది. సాపేక్షికంగా చూస్తే సిక్కులలో కులతత్వం తక్కువగా ఉంటున్నందుకు తగిన మూలాలు ఇక్కడే ఉన్నాయి. సిక్కులలో మెజారిటీ ప్రజలు జాట్‌లు. చారిత్రకంగా వీరు శూద్ర వర్ణానికి చెందినవారు. ఐక్య పంజాబ్‌లో వీరు ద్విజుల చేతుల్లో నానా బాధలకు, అవమానాలకు గురయ్యారు. గురునానక్‌ సిక్కుమతం స్థాపిం చాక ఆయన, అనంతర సిక్కు గురువుల బోధనలను, శ్లోకాలను గురుగ్రంథ సాహిబ్‌ గ్రంథంలో పొందుపర్చారు. వర్ణ వ్యవస్థ నుంచి, శ్రమను అగౌరవపర్చడం నుంచి సిక్కు సమాజం విముక్తి పొందడానికి ఇది పునాది వేసింది. ఇది శూద్ర శ్రామికులలో ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చింది. వారి స్థాయిని మార్చి సమానమైన, గౌరవం కలిగిన సభ్యులుగా కలిపేసుకుంది. అయితే పంజాబ్‌లో దళిత సిక్కులు సామాజిక వివక్షను ఎదుర్కొనడం లేదని దీనర్థం కాదు. 

అయితే సిక్కు కమ్యూనిటీ హిందుత్వ వాదుల స్థాయి కులతత్వాన్ని కలిగిలేదు. అలాగే ఆ స్థాయిలో వీరు వర్ణధర్మాన్ని పాటించడంలేదు. దళిత సిక్కులకు ప్రపంచవ్యాప్తంగా తమవైన రవిదాసి గురుద్వారాలు ఉన్నాయి. పైగా దళిత సిక్కులు ఉన్నత విద్యావంతులై, సిక్కుమతంలో భాగంగా ఉంటూనే తమదైన స్వతంత్ర ఆధ్యాత్మిక, సామాజిక అస్తిత్వాన్ని కలిగి ఉన్నారు. సిక్కు మతాన్ని హిందూ మతంలో భాగంగా చిత్రించడానికి హిందుత్వవాదులు ప్రయత్నిస్తున్నప్పటికీ తమను హిందూమతంలో కలిపేసుకోవడంలో భాగంగా అలా చేస్తున్నారని సిక్కులు స్పష్టంగా గ్రహించారు కాబట్టి హిందుత్వ వాదుల ఆటలు చెల్లడం లేదు.

పైగా గురుగ్రంథ సాహిబ్‌ గురించి తగుమాత్రం జ్ఞానం కలిగి వున్న ఏ సిక్కు అయినా సరే లింగ భేదంతో పనిలేకుండా గ్రంథి అయిపోతారు. ఇది హిందూయిజానికి భిన్నమైనది. సిక్కుమతంలో ఉన్న అలాంటి లింగపరమైన ఆధ్యాత్మిక తటస్థత, ఉత్పత్తి క్రమం, వ్యవసాయ ఉత్పత్తిలో వారి సామూహిక శ్రమ భాగస్వామ్యం, సామర్థ్యత వంటివి పంజాబ్‌ను భారతదేశ ధాన్యాగారంగా మార్చాయి. వ్యవసాయ ఉత్పత్తిలో కులరహిత, లింగ తటస్థతతో కూడిన ఇలాంటి భాగస్వామ్యాన్ని ఆరెస్సెస్, బీజేపీ ఎన్నడూ కోరుకోలేదు. పైగా వర్ణ ధర్మ పరంపరను కొనసాగించడంపై వీరు నొక్కి చెబుతూనే ఉంటారు.

ప్రతి ఒక్కరూ గౌరవంగా పొలంలో పనిచేయడం అనే సామాజిక పునాదిలోనే పంజాబ్‌ వ్యవసాయ పురోగతికి మూలాలున్నాయి. ఇకపోతే గురుద్వారాలలో చేసే కరసేవ ఇప్పటికే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. గురుద్వారాలు ప్రత్యేకించి అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించే ఏ వ్యక్తికైనా అక్కడ ఉచిత భోజనం లభిస్తుంది. కులపరమైన సాంస్కృతిక అగౌరవం చూపకుండానే సంపన్నులు సైతం ఆలయాల్లో శ్రామిక సేవను సాగించే ఇలాంటి సంస్కృతి.. తామే నిజమైన హిందూ జాతీయవాదులుగా ప్రచారం చేసుకుం టూండే ఆరెస్సెస్‌–బీజేపీ అజెండాలో ఎన్నడూ లేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి నినాదాలను ఘనంగా ప్రచారం చేసుకుంటోంది కానీ, ఆధ్యాత్మిక–మత వ్యవస్థలో శ్రమ గౌరవాన్ని చొప్పించకుండా ఈ పదాలకు అర్థమే ఉండదు.

సజీవ వ్యత్యాసం
సకల జనుల శ్రేయస్సుకోసం పనిచేయడం, కరసేవ (అందరి శ్రేయస్సు కోసం శారీరక పనిచేయడం) గురించి సిక్కుమతం నొక్కి చెబుతుంటుంది. ఈ రెండూ గురు గ్రంథ్‌ ఆధ్యాత్మిక సిద్ధాంతంలో రెండు విశిష్ట భావనలు. బ్రాహ్మణవాదానికి వీటి గురించి ఏమీ తెలీని సమయంలోనే సిక్కు గురువులు శ్రమగౌరవానికి చెందిన భావనను గొప్పగా నెలకొల్పారు. హిందుత్వ భావజాలంలో శూద్ర/దళిత రైతులు, కూలీలకు ఏమాత్రం గౌరవం ఉండదు. వీరిని మనుషులుగానే లెక్కించరు. కానీ పంజాబ్‌ వెలుపల భారతీయ ఆహార వ్యవస్థకు వీరే మూలస్తంభాలుగా ఉంటున్నారు. హిందూ ఆధ్యాత్మిక, సామాజిక వ్యవస్థలో వ్యవసాయ పనికి గౌరవం కల్పించే వైపుగా మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. దానికి బదులుగా సామాజిక, ఆర్థిక మార్పులకు ఎన్నడూ దోహదం చేయని, మేటపడిన తమ సంపదను విస్తృత ప్రజానీకం శ్రేయస్సు కోసం ఖర్చుపెట్టకుండా పేద రైతులను దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉంటున్న గుత్త పెట్టుబడిదారులను అనుమతించే తరహా సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది.

సిక్కు రైతులు ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తి జ్ఞానాన్ని తమ వెన్నెముకగా చేసుకున్న బలమైన ప్రపంచవ్యాప్త కమ్యూనిటీలో భాగమయ్యారు. అటవీ భూములను సాగు చేయడానికి వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలసపోయారు. ఈ క్రమంలో ఆయా దేశాల గౌరవనీయ పౌరులుగా మారిపోయారు. ఇప్పుడు వీరు కెనడాలో కీలకమైన రాజకీయ శక్తిగా ఉన్నారు. భారతదేశం వినమ్రంగా వీరి నుంచి నేర్చుకోవాలి. అలాగే సిక్కు కమ్యూనిటీని కించపర్చడంకోసమే నిరంతరం ప్రయత్నిస్తున్న తన శక్తులకు ఆరెస్సెస్‌– బీజేపీ పగ్గాలు వేయాల్సి ఉంది. సిక్కు సమాజాన్ని కించపర్చడాన్ని వీరు ఎంత ఎక్కువగా కొనసాగిస్తే అంతగా వీరు దేశంలోనే కాకుండా ప్రపంచం ముందు కూడా పలచన అయిపోవడం ఖాయం.

ప్రొ. కంచ ఐలయ్య
షెపర్డ్‌
వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత,
సామాజిక కార్యకర్త

 

మరిన్ని వార్తలు