Himalayas: హిమాలయాలను కాపాడుకోవాలి

5 Sep, 2022 13:07 IST|Sakshi
హిమాలయాలు

మళ్లీ హిమాలయ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. హిమాలయాలలో తరచూ జరిగే నష్టాలే ఇవి. పర్యావరణం మీద మానవుల అశ్రద్ధ దీనికి కారణం కావచ్చు. నష్టాల నివారణకు తీసుకోవలసిన చర్యలను తెలుసుకోవడం ఈ సందర్భంగా చాలా ముఖ్యం.  

హిమాలయాల నిర్మాణం మిలియన్ల ఏళ్లుగా కొనసాగుతోంది.  అందుకే ప్రతి ఏడాదీ హిమాలయాలు, కొన్ని సెంటిమీటర్ల ఎత్తు పెరుగుతున్నాయి. ఈ పర్వతాల్లో జన్మించిన నదుల ద్వారా కొట్టుకువచ్చిన రాళ్లు, ఒండ్రు వంటి వాటితో దిగువన ఉన్న  తక్కువ లోతైన టెథిస్‌ సముద్రం నిండి పోయి ప్రపంచంలోనే అతిపెద్ద సారవంతమైన గంగా–సింధు మైదానం ఏర్పడింది. హిమాలయాలు దేశానికి పెట్టని గోడల్లాగా, ఉత్తర దిశలో నేలమార్గంలో వచ్చే శత్రువులనుండి కాపాడుతున్నాయి. సైబీరియా నుండి వచ్చే అతి శీతల గాలుల నుండి భారత ద్వీపకల్పాన్ని కాపాడుతున్నాయి.

సింధు, గంగ, బ్రహ్మపుత్ర జీవనదులకు జన్మనిచ్చి; 40 శాతం భారతీయుల తాగు నీరు, సాగునీరు, పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలు తీరుస్తున్నాయి. ఆపిల్‌ పండ్లనూ, న్యూస్‌ ప్రింట్, ఆయుర్వేద మూలికలనూ అందించే అడవులనూ దేశానికిస్తున్నాయి. ప్రపంచంలోనే అందమైన పర్యాటక ప్రదేశాలు కశ్మీర్, కులూ, మనాలి, సిమ్లా, ముస్సోరీ, డార్జిలింగ్‌లకు పుట్టినిల్లుగా ఉన్నాయి. ఋతుపవనాలకు సహాయం చేస్తున్నాయి. ఇటువంటి హిమాలయాలు లేకపోతే భారతదేశం లేదనటంలో అతిశయోక్తి లేదు. 

అయితే హిమాలయాల్లో అభివృద్ధి పేరిట, పుణ్యస్థలాల పేరిట, పర్యాటకం పేరిట; రోడ్లు వెడల్పు చేయటం, రైల్వేవంతెనలు, జలవిద్యుత్‌ కేంద్రాలు, సొరంగాలు (టన్నెళ్లు)  వంటి వాటిని నిర్మించడం కోసం భారీ బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. హిమాలయాల్లో ఉన్న రాయి దక్కన్‌ పీఠభూమిలో ఉన్న గ్రానైట్‌ రాయిలాగా గట్టిది కాదు. బలహీనమైన మట్టిదిబ్బలు. లూజు రాళ్లు రప్పలతో ఏర్పడిన ఈ ముడుత పర్వతాల చరియలు భారీ పేలుళ్ల కారణంగా విరిగిపడుతున్నాయి. (క్లిక్‌: గొంతు చించుకొని అడగాల్సిందే!)

మానవుడు సృష్టిస్తున్న శక్తిమంతమైన విస్ఫోటనాలు హిమాలయాల భౌతిక స్వరూపాన్నే మార్చేలా తయారయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊహించని విపత్తులు ఎన్నయినా సంభవించే ఆస్కారం ఉంది. పర్యావరణ ప్రేమికులూ, భూ శాస్త్రవేత్తలూ; ఆ ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంపై విషయాలను సానుకూలంగా ఆలోచించి నష్టనివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. తద్వారా హిమాలయాలనూ, అక్కడి పుణ్యక్షేత్రాలనూ, పర్యాటక ప్రదేశాలనూ... చివరగా దేశాన్నీ కాపాడుకుందాం. 


- మరింగంటి శ్రీరామ 
రిటైర్డ్‌ చీఫ్‌ జీఎం, సింగరేణి కాలరీస్, కొత్తగూడెం 

మరిన్ని వార్తలు