చలాన్లు కట్టమన్నారని..

21 Jun, 2023 03:38 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న బైక్‌

శంషాబాద్‌: ట్రాఫిక్‌ నింబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఓ వాహనదారుడిని ట్రాఫిక్‌ పోలీసులు ఆపి చల్లాన్‌లు కట్టమని చెప్పడంతో ఆగ్రహానికి లోనైన అతను వాహనానికి నిప్పు పెట్టేందుకు యత్నించిన సంఘటన శంషాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక కిషన్‌గూడ ఫ్లై ఓవర్‌ వద్ద మంగళవారం మధ్యాహ్నం ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అదే సమయంలో తొండుపల్లి వైపు నుంచి యాక్టీవాపై వస్తున్న ఫసీయుద్దీన్‌ ఆపారు. వాహనంపై మొత్తం 28 చలాన్లు ఉండగా మొత్తం రూ.9150 జరిమానా చెల్లించాల్సి ఉంది. జరిమానా చెల్లించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించడంతో ఆగ్రహానికి లోనైన అతను వెంటనే పెట్రోలు ట్యాంక్‌ తెరిచి అందులో అగ్గిపుల్ల వేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పివేశారు.

ట్రాఫిక్‌ పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించిన అతడిపై ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనంపై త్రిబుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకపోవడం, రాంగ్‌ రూట్‌ తదితర అనేక ఉల్లంఘనలు ఉన్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు