Imran Khan:పీకల్లోతు కష్టాల్లో ఇమ్రాన్‌ ఖాన్‌.. ఆ వివరాలు దొరికితే ఇక జైలుకే!

8 May, 2022 19:35 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆస్తులు, రాబ‌డిపై విచార‌ణ‌కు పాక్‌ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇమ్రాన్ ఆస్తులు, ఆదాయ ప‌త్రాల‌పై ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాని షెబాజ్ ష‌రీఫ్ నేతృత్వంలోని పాక్ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) సెంట్రల్ సెక్రటేరియట్లోని నలుగురు ఉద్యోగుల బ్యాంక్ ఖాతా వివరాలపై ఆరా తీయనుంది. వీరు తాహిర్ ఇక్బాల్, మొహమ్మద్ నోమన్ అఫ్జల్, మొహమ్మద్ అర్షద్ న్యూస్ ఇంటర్నేషనల్ వార్తాపత్రిక మొహమ్మద్ రఫీగా గుర్తించారు. గతంలో ఇమ్రాన్‌ ఖాన్ నేతృత్వంలోని పీటీఐలోని ఈ నలుగురు ఉద్యోగుల ప్రైవేట్ ఖాతాలలోకి భారీ మొత్తంలో డబ్బులు చేరినట్లు అధికారులు గుర్తించారు.

అయితే దీనిపై పూర్తి విచారణ జరిపి ఆధారాలతో సహా బయటపెట్టి వారిని అరెస్ట్‌ చేసేందుకు పాక్‌ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే 2013 నుంచి 2022 మ‌ధ్య పార్టీ విదేశీ విరాళాలకు సంబంధించిన ప‌త్రాల ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇండిపెండెంట్ ఆడిట‌ర్లు ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నుండ‌గా ఫెడ‌ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ, ఫెడ‌ర‌ల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌డ‌తాయి.

పీటీఐ రికార్డుతో పాటు పార్టీ అధినేత అంతర్జాతీయ బ్యాంక్ ఖాతాల వివరాల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా మాజీ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ పదవీకాలంలో వచ్చిన డేటా ఎక్స్ఛేంజ్ ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకోనుంది. యుఎస్, యుకె, కెనడా, నార్వే, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సహా ఇతర విదేశీ బ్యాంకు ఖాతాల రికార్డుల వివరాలను సేకరించేందుకు పాక్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
చదవండి: ఉత్కంఠ రేపుతున్న రష్యా విక్టరీ డే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు