తర్వరలోనే పంచాయతీ పోరు.. ఏర్పాట్లకు ఆదేశించి రాష్ట్ర ఎన్నికల సంఘం!

7 Dec, 2023 12:04 IST|Sakshi

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు

ఫిబ్రవరి 1తో ముగియనున్న ప్రస్తుతం పాలకవర్గం పదవీ కాలం

ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ఈ నెల 30వ తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు

జిల్లాలోని వార్డులు యూనిట్‌గా మూడు దశల్లో ఎన్నికలు

నల్లగొండ: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. 2024 ఫిబ్రవరి 1తో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం పూర్తి కానుంది. పదవీ కాలం ముగిసే మూడు మాసాల ముందుగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్‌, ప్రిసైడింగ్‌, పోలింగ్‌ అధికారులను నియమించాలని సూచించింది. డిసెంబరు 30లోగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు, సిబ్బంది నియామకంతో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, నివేదికలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించింది. దీంతో జిల్లాలో కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించారు.

మూడు నెలల ముందుగానే నిర్వహించాలి..
జిల్లాలో గతంలో 844 గ్రామ పంచాయతీలుండగా, వాటి ఫరిధిలో మొత్తం 7,440 వార్డులు ఉన్నాయి. అయితే ఈ పాలకవర్గాల పదవీ కాలం 2024 పిబ్రవరి 1తో ముగియనుంది. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పదవీ కాలం ముగిసే మూడు మాసాల ముందుగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఎన్నికల సంఘం బుధవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూనుకుంది.

అందుకు సంబంధించి డిసెంబర్‌ 30లోగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అయితే జిల్లాలోని నకిరేకల్‌ మండలంలోని 7 గ్రామ పంచాయతీలు మొదట మున్సిపాలిటీలో చేరాయి. తర్వాత కోర్టు ఆదేశాలతో తిరిగి గ్రామ పంచాయతీలుగా మారాయి. అప్పట్లో వాటి పదవీ కాలం పూర్తయిన తర్వాత తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం ఆ గ్రామ పంచాయతీలు కలుపుకుని మొత్తం 844 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

పంచాయతీ ఎన్నికలకు క్లస్టర్ల ఏర్పాటు
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొన్ని గ్రామాలను కలుపుకుని క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆయా క్లస్టర్ల పరిధిలో స్టేజీ1, స్టేజీ2 అధికారులను నియమించనున్నారు. స్టేజీ 1 పరిధిలో అధికారులంతా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయనుండగా స్టేజీ 2 పరిధిలోని అధికారులు ఎన్నికల నిర్వహణను పూర్తి చేయనున్నారు.

ప్రతి వార్డు ఒక నియోజకవర్గం
గ్రామ పంచాయతీల్లోని ప్రతి వార్డును ఒక నియోజక వర్గంగా ఏర్పాటు చేయనున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్లను బట్టి పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. 650 మంది ఓటర్లుంటే రెండు పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

200 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ స్టేషన్‌
200 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ స్టేషన్‌ చొప్పున ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అందుకు పోలింగ్‌ నిర్వహణకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక పోలింగ్‌ అధికారిని నియమించాలి. అలాగే 201 నుంచి 400 ఓటర్ల వరకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 401 నుంచి 650 ఓటర్లకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌ అధికారులను నియమించాల్సి ఉంటుంది.

వీరందరికి ఎన్నికలకు సంబంధించిన శిక్షణను కూడా ఇవ్వాలి. ఎన్నికల నిర్వహణకు ఎంత మంది అధికారులు, సిబ్బంది అవసరమో, దానిపై 20 శాతం సిబ్బందిని అదనంగా తీసుకుని రిజర్వులో ఉంచేలా అధికారులు, సిబ్బందిని ఎంపిక చేయాలని సూచించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు సంబంధించి జాబితా తీసుకుని అందులో అవసరమైన వారిని గుర్తించాలని సూచించింది. డిసెంబరు 30వ తేదీలోగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బంది అందరిని గుర్తించి ఆ డేటాను టీపోల్‌ అప్లికేషన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలని సూచించింది.

మూడు దశల్లో ఎన్నికలు
జిల్లాలో ఉన్న 844 గ్రామ పంచాయతీలకు సంబంధించి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో మొదటి విడత కొన్ని గ్రామ పంచాయతీలకు, రెండో విడత మరికొన్ని, మూడో విడత మిగిలిన గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. అయితే ఎన్నికల ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అధికారుల నియామకం విషయంలో వారి స్థాయిని బట్టి చూసుకోవాలని ఆదేశించింది. అయితే ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నందున మొదటి గ్రామ పంచాయతీ స్టేజీ 1 రిటర్నింగ్‌ అధికారులు, ప్రీసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ అధికారులు మూడు దశల్లో ఎన్నికలకు ముసాయిదాలు సిద్ధం చేయాల్సి ఉంది. ఈ మూడు దశలకు సంబంధించి ర్యాండమైజేషన్‌ పద్ధతిలో పోలింగ్‌ సిబ్బందిని గుర్తించాలని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం అందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది.

>
మరిన్ని వార్తలు