జిల్లాలో కరువు ఉపశమన చర్యలు | Sakshi
Sakshi News home page

జిల్లాలో కరువు ఉపశమన చర్యలు

Published Fri, Nov 24 2023 1:48 AM

- - Sakshi

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌

నంద్యాల(సెంట్రల్‌): జిల్లాలో కరువు ఉపశమన చర్యలను ప్రారంభించాలని అధికారులను కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం ఆ వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాలో కరువు మండలాలను నిర్ధారిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో బనగానపల్లె, మిడుతూరు, పగిడ్యాల, గడివేముల, బేతంచెర్ల మండలాల్లో తీవ్ర కరువు ఉండగా, పాణ్యం మండలంలో ఓ మోస్తరుగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పురపాలక, పట్టణ, సాగునీటి పారుదల సౌకర్యం కలిగిన ప్రాంతాలను కరువు జాబితా నుంచి మినహాయిస్తున్నామని తెలిపారు. అయితే తాగునీటి విషయంలో ఈ ప్రాంతాలను కూడా కరువు ప్రాంతాలతో పాటు సమానంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు కరువు సహాయ కార్యక్రమాలను ప్రారంభించి, ప్రగతి నివేదికలను జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని ఆదేశించారు.

నిప్పులవాగుకు 614 క్యూసెక్కుల నీరు

జూపాడుబంగ్లా: నిప్పులవాగుకు 614 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుంకేసుల డ్యాం నుంచి కేసీ కాల్వకు 1,900 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తుండగా ఈ నీరు లాకిన్స్‌లా వరకు 1,285 క్యూసెక్కులు చేరుతోందన్నారు. నిప్పులవాగుకు 614 క్యూసెక్కులు, తూడిచెర్ల సబ్‌ఛానల్‌ కాల్వకు 655 క్యూసెక్కులు, అలగనూరు రిజర్వాయర్‌ కాల్వకు 20 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి శుక్రవారం నీటిి పంపింగ్‌ పునఃప్రారంభించనున్న నేపథ్యంలో కేసీ కాల్వకు మరింతగా సాగునీరు పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆర్‌యూ ఇన్‌చార్జి వీసీగా ఫజుల్‌ రహిమాన్‌?

కర్నూలు(సెంట్రల్‌): రాయలసీమ యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ వైస్‌చాన్స్‌లర్‌గా డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ యూనివర్సిటీ వీసీ ఫజుల్‌ రహిమాన్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఆర్‌యూ వైస్‌ చాన్స్‌లర్‌గా ఉన్న ప్రొఫెసర్‌ ఆనందరావు పదవీ కాలం శుక్రవారంతో ముగుస్తుంది. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో గురువారం ఈసీ సమావేశం నిర్వహించి.. తనకు కావలసిన వారికి మేలు చేసేలా వీసీ నిర్ణయాలు తీసుకున్నట్లు విమర్శలు వచ్చాయి. రిటైర్డ్‌ రిజిస్ట్రార్‌ మధుసూదన రావు పెన్షన్‌కు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. అలాగే బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ విభాగాల్లో తనకు అనుకూలమైన ఇద్దరు కాంట్రాక్టు ప్రొఫెసర్ల గడువు ముగుస్తుండటంతో వారి పదవీ కాలాన్ని పొడిగించినట్లు తెలుస్తోంది.

నల్లమలలో 76 పెద్దపులులు

మహానంది: నంద్యాల జిల్లాలోని నాలుగు డివిజన్లలో సుమారు 76 పెద్దపులులు ఉన్నట్లు నంద్యాల ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ దినేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మహానందిలోని పర్యావరణ కేంద్రం వద్ద గురువారం నర్సరీ మొక్కలను పరిశీలించిన అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఆర్‌ఓ దినేష్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నల్లమలలోని పెద్దపులులు, చిరుత పులులు, అడవి కుక్కల సంతతి గుర్తింపునకు సుమారు 40 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. నల్లమల పరిసర గ్రామాల్లో ఎవరైనా వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా అడవుల్లో ప్రవేశించే వారిపై, సంపదను అక్రమంగా రవాణా చేసేవారిపై నిరంతర నిఘా ఉంచామన్నారు. ఆయన వెంట డీఆర్‌ఓ హైమావతి, ఎఫ్‌బీఓలు ప్రతాప్‌, శ్రీనివాసులు, పీడబ్ల్యూ నాగముని ఉన్నారు.

డీఆర్‌ఓ, ఎఫ్‌బీఓలతో మాట్లాడుతున్న 
ఎఫ్‌ఆర్‌ఓ దినేష్‌కుమార్‌రెడ్డి
1/1

డీఆర్‌ఓ, ఎఫ్‌బీఓలతో మాట్లాడుతున్న ఎఫ్‌ఆర్‌ఓ దినేష్‌కుమార్‌రెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement