ఒక్కరోజులో 95 వేల కేసులు

11 Sep, 2020 06:12 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 95,735 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో వచ్చిన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,65,863 కు చేరుకుంది. గత 24 గంటల్లో 74,894 మంది కోలుకోగా 1,172 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 75,062 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 34,71,783 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,19,018 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.58 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. గురువారానికి ఇది 77.74 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.68 శాతానికి పడిపోయిందని తెలిపింది.

వారికి మళ్లీ పరీక్ష చేయాల్సిందే
కరోనా నిర్థారణ కోసం నిర్వహించే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌(ర్యాట్‌)లో నెగెటివ్‌ వచ్చినా కరోనా లక్షణాలు ఉంటే అలాంటి వారికి తప్పక పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ విధంగా చేయడం వల్ల కరోనా విస్తరించే అవకాశం తగ్గుతుందని చెప్పింది. ర్యాట్‌ తర్వాత లక్షణాలు ఉన్న వారిని పట్టించుకోకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నందున ఈ మార్గదర్శకాలను కేంద్రం రాష్ట్రాలకు అందించింది. నెగెటివ్‌ ఉన్నా లక్షణాలు కనిపించిన వారికి ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేయాలని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు