రోజు గోమూత్రం తాగుతాను.. అందుకే కరోనా రాలేదు: బీజేపీ ఎంపీ

17 May, 2021 21:01 IST|Sakshi

సంచలన వ్యాఖ్యలు  చేసిన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌

భోపాల్‌: ఓ వైపు కరోనా వైరస్‌ని కట్టడి కోసం ప్రభుత్వాలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తుండగా.. మరోవైపు జనాలు మూఢనమ్మకాలతో వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. ఆవు పేడ రాసుకుంటే, తాటి కల్లు తాగితే కరోనా తగ్గుతుందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతన్న సంగతి తెలిసిందే. సామాన్యులు ఇలాంటి వాటిని ప్రచారం చేస్తున్నారంటే అనుకోవచ్చు.. కానీ ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతారహితంగా మాట్లాడటం విచారకరం. తాజాగా బీజేపీ ఎంపీ ఒకరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు. 

తాను ప్రతిరోజు గోమూత్రం తాగుతున్నానని.. అందుకే కరోనా బారిన పడలేదని తెలిపారు బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. పార్టీ సమావేశంలో ప్రగ్యా ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ప్రతిరోజు గోమూత్రం సేవిస్తాను. అందుకే నాకు కరోనా సోకలేదు. దేశీ గో మూత్రం తాగడం వల్ల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ తగ్గిపోతుంది’’ అన్నారు. 

‘‘అయితే ప్రతిరోజు ప్రార్థన చేసిన తరువాతనే నేను గోమూత్రాన్ని సేవిస్తాను. ఇది నా ప్రాణాలు కాపాడే అమృతం. నా ప్రాణాన్ని కాపాడు.. నా జీవితం దేశానికే అంకింతం అంటూ ప్రార్థిస్తాను.  నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే. ప్రతిరోజు గోమూత్రం సేవించండి.. మీ ప్రాణాలు కాపాడుకోండి’’ అంటూ సాగిన ఈ ఉపన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక వ్యాక్సిన్లు ఇవ్వడం ఆపి.. దేశవ్యాప్తంగా గోమూత్రం పంచండి అంటూ విమర్శిస్తున్నారు నెటిజనులు. 

చదవండి: ఘోరం: కరోనా పేషెంట్‌కు ఆవు మూత్రం పోసిన నేత

మరిన్ని వార్తలు