ఇంటర్నెట్‌ సమస్య తొలగాలి

27 Jun, 2021 03:26 IST|Sakshi

మారుమూల ప్రాంతాల లాయర్లకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ లభ్యత ఉండాలి

కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రికి సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ లేఖ

సాక్షి, న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల్లో ఉన్న న్యాయవాదుల కోసం హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ వసతి అందుబాటులోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ కేంద్రప్రభుత్వానికి సూచించారు. నగరాల్లోని లాయర్లకు అందుబాటులో ఉన్నట్టుగా సబార్డినేట్‌ కోర్టు స్థాయిలో లాయర్లకూ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో లేదన్న అంశాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు తాను 8న లేఖ రాసినట్టు తెలిపారు.

సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ రచించిన ‘చట్టం, న్యాయంలో క్రమరాహిత్యాలు’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్‌ డిస్కషన్‌లో పాల్గొన్నారు.  గ్రామీణ, గిరిజన, మారుమూల, పర్వత ప్రాంతాల్లో కనెక్టివిటీ సరిగాలేక న్యాయం అందడంలో వేగంపై తీవ్ర ప్రభావం చూపిందని, వేలాది మంది యువ న్యాయవాదుల జీవనోపాధికి తీవ్ర విఘాతం కలిగించిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లభ్యతలో తారతమ్యాల కారణంగా న్యాయవ్యవస్థ నుంచి ఒక తరం న్యాయవాదులను బలవంతంగా నెట్టివేసినట్టు అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్న లాయర్లకు సాయపడేందుకు యంత్రాంగం ఏర్పాటుచేయాలని న్యాయ శాఖ మంత్రికి సూచించినట్లు వెల్లడించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు