రూ.1400 కోట్ల స్కాం: ఆప్‌ నేతలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పరువునష్టం దావా!

31 Aug, 2022 16:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రూ.1,400 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన ఆమ్‌ ఆద్మీ నేతలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా. తనపై తప్పుడు, గౌరవానికి భంగం కలిగించే విధంగా అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు అతిష్‌, సౌరభ్‌ భరద్వాజ్‌లతో పాటు పలువురు ఆప్‌ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది ఎల్‌జీ కార్యాలయం. 

2016 నోట్ల రద్దు సమయంలో ఎల్‌జీ సక్సెనా సుమారు రూ.1,400 కోట్లు రద్దు చేసిన నోట్లు మార్పిడి చేయించారని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఖాదీ విభాగనికి ఛైర్మన్‌గా ఉండి ఆ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. అయితే, ఆ ఆరోపణలను తిప్పికొట్టారు సక్సేనా. ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జాస్మిన్‌ షాపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఒకరిపై ఆరోపణలు చేసేందుకు గంతులేస్తూ వచ్చే లక్షణం కేజ్రీవాల్‌ అండ్‌ కోది. ఆప్‌ నేతలు చేసిన తప్పుడు, పరువునష్టం కలిగించే ఆరోపణలపై ఎల్‌జీ ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆప్‌ నేతలు  తప్పించుకోలేరు.’ అని ఎల్‌జీ సక్సేనా కార్యాలయం పేర్కొంది.

ఇదీ చదవండి: Delhi Liquor Policy: ఎల్‌జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్‌.. మరో 6 నెలలు..! 

>
మరిన్ని వార్తలు